Silver Price: రూ. 2.50 లక్షలు దాటిన వెండి.. బంగారం ధర రూ. 1.40 లక్షలు

by S Gopi |

వెండి ధరలు కొత్త రికార్డులను బద్దలు కొడుతోంది. వెండి తొలిసారి రూ. 2.50 లక్షలు దాటింది.

Silver Price: రూ. 2.50 లక్షలు దాటిన వెండి.. బంగారం ధర రూ. 1.40 లక్షలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ మార్కెట్లో వెండి, బంగారం ధరలు పోటీ పడి మరీ దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే రికార్డు గరిష్ఠాలకు చేరిన వెండి, పసిడి ధరలు శుక్రవారం కూడా కొత్త గరిష్ఠాలకు చేరాయి. ముఖ్యంగా వెండి ధరలు కొత్త రికార్డులను బద్దలు కొడుతోంది. వెండి తొలిసారి రూ. 2.50 లక్షలు దాటింది. శుక్రవారం వెండి రూ. 9,000 పెరగడంతో కిలో రూ. 2,54,000కి చేరుకుంది. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం రూ. 1,41,900 లక్షలు దాటింది. బులియన్ మార్కెట్ వివరాల ప్రకారం, హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన పసిడి 10 గ్రాములు రూ. 770 పెరిగి రూ. 1,40,120 చేరుకుంది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములు రూ. 700 పెరిగి రూ. 1,28,350 వద్ద ఉంది. వచ్చే ఏడాది అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లలో కోత విధిస్తుందన్న అంచనాలు పెరగడం, బంగారంలో పెట్టుబడులకు గిరాకీ కొనసాగడం, అమెరికా డాలర్‌తో పాటు భారత కరెన్సీ రూపాయి బలహీనంగా కొనసాగుతుండటం కారణాలుగా ఉన్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెట్టుబడిదారులను బంగారం, వెండిని సురక్షిత పెట్టుబడి సాధనంగా ఎంచుకుంటున్నారు. వెండికి సంబంధించి పెట్టుబడులకు మాత్రమే కాకుండా పారిశ్రామిక డిమాండ్ కూడా ధరలను ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్, ఈవీలు, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్ల నుంచి వెండి కోసం అధిక గిరాకీ ఉంది. దీనివల్ల తక్కువ సరఫరా, మార్కెట్ లోటు వల్ల వెండి ధరలు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లలోనూ ఈ ప్రభావం కారణంగా ఔన్స్ బంగారం 4,529.96 డాలర్లకు చేరింది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా వెండి ధరలు కూడా సుమారు 5 శాతం పెరిగి మొదటిసారిగా ఔన్సుకు 75 డాలర్ల మార్కును దాటాయి.

Next Story