Royal Enfield: ప్రపంచ టాప్-3 ఆటో బ్రాండ్‌లలో రాయల్ ఎన్‌ఫీల్డ్

by S Gopi |

ముఖ్యంగా ఆడి, ఫెరారీ వంటి అంతర్జాతీయ దిగ్గజ బ్రాండ్‌లను అధిగమించడం విశేషం.

Royal Enfield: ప్రపంచ టాప్-3 ఆటో బ్రాండ్‌లలో రాయల్ ఎన్‌ఫీల్డ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. కంపెనీ ప్రపంచంలోనే మూడవ అత్యంత బలమైన ఆటోమోటివ్ బ్రాండ్‌గా నిలిచింది. బ్రాండ్ ఫైనాన్స్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ 2026 నివేదిక ప్రకారం, టయోటా, బీఎండబ్ల్యూ తర్వాత రాయల్ ఎన్‌ఫీల్డ్ మూడో స్థానాన్ని దక్కించుకుంది. ముఖ్యంగా ఆడి, ఫెరారీ వంటి అంతర్జాతీయ దిగ్గజ బ్రాండ్‌లను అధిగమించడం విశేషం. కంపెనీకి 100లో 88.9 బ్రాండ్ స్ట్రెంత్ ఇండెక్స్ స్కోరు, ఏఏఏ రేటింగ్ లభించగా, బ్రాండ్ విలువ 30 శాతం పెరిగి 1.2 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో రూ. 11.33 వేల కోట్ల)కు చేరుకుంది. ఈ జాబితాలో టాటా మోటార్స్ ఐదో స్థానంలో నిలవడం, మహీంద్రా, మారుతి సుజుకి కూడా జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. గత కొన్నేళ్లుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ భారత మార్కెట్‌కే పరిమితం కాకుండా అంతర్జాతీయ విస్తరణపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం కంపెనీ 80కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, ప్రపంచవ్యాప్తంగా 3,200కు పైగా రిటైల్ అవుట్‌లెట్లు నిర్వహిస్తోంది. యూరప్, ఆగ్నేయాసియా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా మార్కెట్లలో ఈ బ్రాండ్‌కు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా రెట్రో డిజైన్, సింపుల్ రైడింగ్ అనుభవం, మిడ్-సైజ్ ఇంజిన్ సెగ్మెంట్‌లో ఉన్న ప్రత్యేక స్థానమే కంపెనీకి గ్లోబల్ గుర్తింపును తెచ్చిపెడుతోంది. ప్రధానంగా హంటర్ 350, సూపర్ మీటియర్ 650, హిమాలయన్ 450 వంటి మోడళ్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ యువతతో పాటు టూరింగ్ రైడర్లను కూడా ఆకర్షిస్తోంది.

Next Story