- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Union Budget: బడ్జెట్‌లో దీర్ఘకాలిక ప్రణాళికపై దృష్టి పెట్టాలి
గతంలో దేశానికి పంచవర్ష ప్రణాళికలు ఉండేవి, అయినప్పటికీ దేశ బడ్జెట్ వాటితో సరిగ్గా అనుసంధానం కాలేదు.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచం 'అత్యంత ప్రమాదకరమైన సందర్భం'లో ఉన్నందున, రాబోయే బడ్జెట్ భారత ఆర్థికవ్యవస్థను మరింత పటిష్టంగా, స్వయం సమృద్ధిగా మార్చేలా ఉండాలని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో వృద్ధిని వేగవంతం చేయడానికి దీర్ఘకాలిక ప్రణాళికతో అనుసంధానం చేయాలని రాజన్ సూచించారు. బుధవారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. గతంలో దేశానికి పంచవర్ష ప్రణాళికలు ఉండేవి, అయినప్పటికీ దేశ బడ్జెట్ వాటితో సరిగ్గా అనుసంధానం కాలేదు. కాబట్టి ఈసారి 2026-27 కేంద్ర బడ్జెట్‌ను దీర్ఘకాలిక దార్శనికత, ప్రణాళికతో అనుసంధానం చేయాలని నేను భావిస్తున్నాను. ఒక ఆర్థికవ్యవస్థగా మరింత పటిష్టంగా, స్వయం సమృద్ధిగా మారాలి, అదే సమయంలో వేగంగా వృద్ధి చెందాలి, దానివల్ల ఇతర దేశాలన్నీ భారత్‌తో స్నేహం చేయాలనుకుంటాయి. దీనికి చాలా కృషి చేయాల్సి ఉంది, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే తదుపరి బడ్జెట్ మనల్ని ఆ దిశగా తీసుకువెళ్తుందని నేను ఆశిస్తున్నానని ఆయన వివరించారు.
ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి అస్థిరంగా మారిన భౌగోళిక రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక వృద్ధిని బలోపేతం చేయడానికి సంస్కరణ చర్యలు ఉంటాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రఘురామ్ రాజన్ పైవ్యాఖ్యలు చేశారు. ప్రపంచంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థ రెండింటికీ ఇది 'అత్యంత ప్రమాదకరమైన సమయం' అని రాజన్ అన్నారు.
ఏఐపై ఆధారపడొద్దు
కృత్రిమ మేధస్సు (ఏఐ)లో భారీ పెట్టుబడుల నుంచి మనం చాలా సానుకూల అవకాశాలను చూస్తున్నామన్నారు. అయితే, సమీప కాలంలో మనకంటూ సహజమైన మార్కెట్ లేనందున, ఇతర దేశాలకు సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడితే, ఇబ్బందులు తప్పవు. కాబట్టి బలహీనపరిచే సంస్థలపై ఎక్కువగా ఆధారపడటం వల్ల కూడా ప్రమాదం ఉంటుందని గుర్తించుకోవాలి. రాబోయే బడ్జెట్ మనదేశ సరఫరాకు అడ్డుగా ఉన్న కొన్ని రకాల సుంకాల రేట్లను తగ్గించవచ్చని రాజన్ తెలిపారు. వాస్తవానికి, దేశంలోని అనేక రాష్ట్రాలు పెట్టుబడులకు అనుకూలమైన విధానాలను రూపొందిస్తున్నాయి. తద్వారా రాష్ట్రాలు కూడా సహాకారం అందిస్తున్నాయి. కానీ మనకు అలాంటి పాలసీలు ఇంకా చాలా అవసరమని పేర్కొన్నారు.
బయటి విషయాలతో పనిలేదు
అమెరికాతో పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలను తట్టుకోవడానికి ఎటువంటి దేశీయ సంస్కరణలు, విధానాలు భారత్‌కు సహాయపడతాయని అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన ఆయన.. భారత్ ప్రస్తుతం బయటి విషయాలను పట్టించుకోకుండా ఉండటమేనని అన్నారు. ఎందుకంటే దేశం వెలుపలి విషయాల పట్ల శ్రద్ధ వహిస్తే, చాలా గందరగోళం ఏర్పడుతుంది, దానికి బదులుగా వృద్ధి రేటును పెంచడానికి ఏమి చేయాలనే అంశాన్ని చూడాలని ఆయన అన్నారు.
1990ల నుంచి 2000ల ప్రారంభం వరకు చాలా పెద్ద సంస్కరణలను జరిగాయి. ఆ తర్వాత కొంతకాలం పాటు పెద్దగా ఏమీ చేయలేదు. ఆ ప్రక్రియను మళ్లీ ప్రారంభించడానికి ఇది సమయం అని నేను భావిస్తున్నాను. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇటీవల సంస్కరణలను అమలు చేయడంపై, భారత ఆర్థిక వృద్ధికి మరో రెండు శాతం పాయింట్లు జోడించడానికి ఏమి అవసరమో దానిపై మరింత దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రస్తుత పరిస్థితులు ప్రపంచ సరఫరా గొలుసులో మనల్ని మనం తిరిగి చేర్చుకోవడానికి లభించిన ఒక అవకాశమని వెల్లడించారు.






