BSNL: దేశీయ శాటిలైట్ కమ్యూనికేషన్ రంగంలో సరికొత్త యుద్ధం

by S Gopi |

రక్షణ, సముద్రయానం, విపత్తు సహాయక చర్యలు, మైనింగ్, మారుమూల ప్రాంతాల్లో పనిచేసే సంస్థలు, అడ్వెంచర్ టూరిజం వంటి రంగాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపొందించినట్లు బీఎస్ఎన్ఎల్ తెలిపింది.

BSNL: దేశీయ శాటిలైట్ కమ్యూనికేషన్ రంగంలో సరికొత్త యుద్ధం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ శాటిలైట్ కమ్యూనికేషన్ రంగంలో సరికొత్త యుద్ధం మొదలైంది. ఎలాన్ మస్క్‌కు చెందిన 'స్టార్‌లింక్', ముకేశ్ అంబానీకి చెందిన 'జియో స్పేస్ ఫైబర్', ఎయిర్‌టెల్ 'వన్ వెబ్' వంటి గ్లోబల్ దిగ్గజాలు శాటిలైట్ ఇంటర్నెట్ విభాగంలో సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ప్రైవేట్ కంపెనీల పోటీని తట్టుకోవడానికి, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త వ్యూహాన్ని ఎంచుకుంది. 2018 నుంచే అందుబాటులో ఉన్న తన గ్లోబల్ శాటిలైట్ ఫోన్ సర్వీస్ (జీఎస్‌పీఎస్)కు సంబంధించి తాజాగా ధరలను, ప్లాన్లను అధికారికంగా ప్రకటించింది. అన్ని పన్నులతో కలిపి ఈ శాటిలైట్ ఫోన్ ధర రూ.1,34,166గా నిర్ణయించింది. ముఖ్యంగా రక్షణ, సముద్రయానం, విపత్తు సహాయక చర్యలు, మైనింగ్, మారుమూల ప్రాంతాల్లో పనిచేసే సంస్థలు, అడ్వెంచర్ టూరిజం వంటి రంగాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపొందించినట్లు బీఎస్ఎన్ఎల్ తెలిపింది.

అడ్వెంచర్ టూరిజంపై కన్ను

గతంతో పోలిస్తే ప్రస్తుతం దేశంలో లదాఖ్, హిమాలయాలు, నార్త్-ఈస్ట్ వంటి మారుమూల ప్రాంతాలకు ట్రెకింగ్ వెళ్లే ట్రావెలర్లు, కొండల్లో ఆఫ్-రోడ్ రైడింగ్ చేసే వారి సంఖ్య భారీగా పెరిగింది. సాధారణ మొబైల్ సిగ్నల్స్ అస్సలు అందని ఇటువంటి దట్టమైన అడవులు, ఎత్తైన పర్వత ప్రాంతాలు, సముద్రయానం చేసే కార్పొరేట్ సంస్థలను టార్గెట్ చేస్తూ బీఎస్ఎన్ఎల్ ఈ ఫోన్ సేవలను అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ తెలిపింది. అన్ని రకాల పన్నులతో కలిపి రూ. 1.34 లక్షలకు లభించే ఈ ఫోన్, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా తొలగిపోకుండా కాపాడే అధునాతన 'లైఫ్-సేవర్' అని టెలికాం రంగ నిపుణులు చెబుతున్నారు.

ప్లాన్ వివరాలు

బీఎస్ఎన్ఎల్ ఈ శాటిలైట్ ఫోన్ సేవలను ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల కోసం ప్రత్యేక పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ ప్లాన్‌లు అందిస్తోంది. పోస్ట్‌పెయిడ్‌లో ప్రభుత్వ సంస్థలకు నెలకు రూ.3,500 (జీ1), రూ.5,835 (జీ2) ప్లాన్‌లు అందుబాటులో ఉండగా, వీటిలో వరుసగా 16 నిమిషాలు, 30 నిమిషాల ఉచిత టాక్‌టైమ్/ఎస్సెమ్మెస్ లభిస్తాయి. ప్రైవేటు వ్యక్తులకు నెలవారి రూ.11,670 (సీ1) ప్లాన్‌లో 60 నిమిషాల ఉచిత టాక్‌టైమ్/ఎస్సెమ్మెస్ ఉంటుంది. ప్రీపెయిడ్‌లో ప్రభుత్వ సంస్థలకు నెలకు రూ.3,500 (జీ1) ప్లాన్‌లో 20 నిమిషాలు, ఏడాదికి రూ.38,500 (జీఏ) ప్లాన్‌లో 240 నిమిషాల ఉచిత టాక్‌టైమ్/ఎస్సెమ్మెస్ లభిస్తుంది. ప్రైవేటు వ్యక్తులకు నెలకు రూ.5,835 (సీ1) ప్లాన్‌లో 30 నిమిషాలు, ఏడాదికి రూ.64,185 (సీఏ) ప్లాన్‌లో 360 నిమిషాల ఉచిత టాక్‌టైమ్/ఎస్సెమ్మెస్ అందుతుంది. కేటాయించిన ఉచిత నిమిషాలు పూర్తయిన తర్వాత ప్రభుత్వ సంస్థలకు నిమిషానికి లేదా ఒక్కో ఎస్సెమ్మెస్‌కు రూ.18, ప్రైవేటు వ్యక్తులకు రూ.25 చొప్పున అదనపు ఛార్జీలు వర్తిస్తాయి.

కొనాలంటే కఠిన నిబంధనలు

చట్టపరంగా సాధారణ పౌరులు కూడా బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్‌ను కొనుగోలు చేయడానికి వీలుంటుంది. కానీ, ఆచరణలో మాత్రం ఇది అంత సులభమైన పనికాదు. కమర్షియల్ వినియోగానికి అందుబాటులో ఉన్నప్పటికీ, బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్‌ను సాధారణ మొబైల్ ఫోన్‌లా నేరుగా కొనుగోలు చేయడం సాధ్యం కాదు. టెలికాం శాఖ మార్గదర్శకాల ప్రకారం కేవైసీతో పాటు వినియోగ ప్రాంతం, కాలవ్యవధి, వినియోగ ఉద్దేశాన్ని వెల్లడించిన తర్వాతే కనెక్షన్ మంజూరవుతుంది.

Next Story