భారీ లాభాల్లో BSNL

by Muthe.Rajitha |

దేశీయ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) భారీ లాభాలను సాధించింది.

భారీ లాభాల్లో BSNL
X

దిశ, వెబ్ డెస్క్ : దేశీయ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) భారీ లాభాలను సాధించింది. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో(జనవరి-మార్చి) BSNL రూ.280 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది 18 ఏళ్లలో(2007 తర్వాత) వరుసగా రెండు త్రైమాసికాల్లో లాభం సాధించడం ఇదే మొదటిసారి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో (2024 జనవరి-మార్చి) రూ.849 కోట్ల నష్టాన్ని చవిచూసింది. అంతకుముందు త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్ 2024)లో రూ.262 కోట్ల లాభం సాధించింది. ఈ వరుస లాభాలతో 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం నష్టం రూ.5,370 కోట్ల నుంచి రూ.2,247 కోట్లకు (58%) తగ్గింది.

బీఎస్ఎన్ఎల్ ఆదాయం 2024-25లో 7.8% పెరిగి రూ.19,330 కోట్ల నుంచి రూ.20,841 కోట్లకు చేరింది. మొబైల్ సేవలు, ఫైబర్-టు-ది-హోమ్(FTTH), లీజ్డ్ లైన్ సేవల్లో 14-18% వృద్ధి కనిపించింది. అలాగే ఖర్చులను తగ్గించడం, 4G/5G నెట్‌వర్క్ విస్తరణ, ప్రభుత్వం నుంచి రూ.3 లక్షల కోట్లకు పైగా సహాయం (4G/5G స్పెక్ట్రమ్, రుణాల మాఫీ, మూలధనం) ఈ లాభాలకు కారణం. కాగా BSNL ఇప్పటివరకు 98,000 4G టవర్లను ఏర్పాటు చేసింది. హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా వంటి నగరాల్లో 5G టెస్టింగ్ మొదలుపెట్టింది.

కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ విజయాన్ని "BSNL పునర్జన్మ"గా అభివర్ణించారు. సంస్థ చైర్మన్ రాబర్ట్ జె. రవి.. లాభాల కంటే వినియోగదారులకు సేవలను మెరుగుపరచడం, దేశంలోని అన్ని ప్రాంతాలకు నాణ్యమైన కనెక్టివిటీ అందించడమే లక్ష్యమని చెప్పారు. అయితే, 4G/5G విస్తరణకు ఎక్కువ ఖర్చు, స్పెక్ట్రమ్ కొనుగోళ్ల వల్ల తదుపరి సంవత్సరం లాభాలు కొంత తగ్గవచ్చని కంపెనీ అంచనా వేస్తోంది.

Next Story