Bitcoin: బిట్‌కాయిన్ భారీ పతనం.. ఒక్కరోజే 12 శాతం కుదేలు

by Kema Shiva Kumar |

అంతర్జాతీయ క్రిప్టో కరెన్సీ మార్కెట్‌లో భారీ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

Bitcoin: బిట్‌కాయిన్ భారీ పతనం.. ఒక్కరోజే 12 శాతం కుదేలు
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ క్రిప్టో కరెన్సీ మార్కెట్‌లో భారీ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ కరెన్సీ బిట్‌కాయిన్ (Bitcoin) విలువ ఒక్కసారిగా కుప్పకూలింది. కేవలం 24 గంటల వ్యవధిలోనే బిట్‌కాయిన్ ధర 12 శాతానికి పైగా పతనమై 63,295 డాలర్ల స్థాయికి చేరుకుంది. అయితే, గత రెండేళ్ల కాలంలో బిట్‌కాయిన్ ఒకే రోజులో ఈ స్థాయిలో పడిపోవడం ఇదే మొదటిసారి. 2022 నవంబర్ తర్వాత నమోదైన అత్యధిక ఒక రోజు పతనం ఇదే కావడంతో మార్కెట్ వర్గాల్లో ఆందోళన నెలకొంది. 2024 ప్రారంభం నుండి లాభాల బాటలో పయనించిన బిట్‌కాయిన్, ప్రస్తుతం అత్యంత బలహీనమైన దశలోకి ప్రవేశించిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

బిలియన్ డాలర్ల సంపద ఆవిరి..

మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితితో ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోతున్నారు. ఈ భారీ పతనం కారణంగా ప్రపంచవ్యాప్తంగా మదుపర్లు దాదాపు 1 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు రూ. 8,300 కోట్ల విలువైన బిట్‌కాయిన్ పొజిషన్లను వదిలించుకున్నారు. అమ్మకాల ఒత్తిడి పెరగడంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా క్షీణించింది. గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకుంటున్న నిర్ణయాలు, క్రిప్టో ఎక్స్ఛేంజీల నుంచి భారీగా నిధులు ఉపసంహరణే ఈ పతనానికి ప్రధాన కారణాలని తెలుస్తోంది. కేవలం బిట్‌కాయిన్ మాత్రమే కాకుండా, దీని ప్రభావంతో ఇథీరియం, సోలానా వంటి ఇతర ప్రధాన క్రిప్టో కరెన్సీలు కూడా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఇన్వెస్టర్లు ప్రస్తుత పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని, మార్కెట్ స్థిరపడే వరకు వేచి చూడటం ఉత్తమమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Next Story