Bharatpe: కొత్త తరహా ఫీచర్ ప్రారంభించిన భారత్‌పే

by S Gopi |

వినియోగదారులు తమ సాధారణ యూపీఐ చెల్లింపులనే కొనసాగిస్తూ, అవసరమైనప్పుడు క్రెడిట్ సౌకర్యాన్ని కూడా వినియోగించుకోవచ్చు.

Bharatpe: కొత్త తరహా ఫీచర్ ప్రారంభించిన భారత్‌పే
X

దిశ, బిజినెస్ బ్యూరో: డిజిటల్ చెల్లింపుల రంగంలో మరో కీలక అడుగు వేస్తూ భారత్‌పే, యెస్ బ్యాంక్‌తో కలిసి 'భారత్‌పే ఫ్లెక్స్' అనే కొత్త క్రెడిట్-ఆన్-యూపీఐ సేవలను ప్రారంభించింది. యూపీఐ చెల్లింపులకూ క్రెడిట్‌ కార్డు తరహా సదుపాయం కల్పించే ఈ సదుపాయం ద్వారా వినియోగదారులు తమ సాధారణ యూపీఐ చెల్లింపులనే కొనసాగిస్తూ, అవసరమైనప్పుడు క్రెడిట్ సౌకర్యాన్ని కూడా వినియోగించుకోవచ్చు. అంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి షాపుల్లో చెల్లించడం నుంచి ఆన్‌లైన్ కొనుగోళ్లు, బిల్లు చెల్లింపులు, రీఛార్జ్‌లు, ట్రావెల్ బుకింగ్‌లు, ఇంధన ఖర్చులు వరకు అన్ని యూపీఐ లావాదేవీలకు ఈ క్రెడిట్ లైన్ ఉపయోగించుకోవచ్చు. భారత్‌పే ఫ్లెక్స్ ప్రత్యేకత ఏమిటంటే, యూజర్లు ముందుగా చెల్లింపులు చేసి తర్వాత బిల్లును క్లియర్ చేసే అవకాశం కల్పించడం. బ్యాంక్‌ అకౌంట్‌లో సొమ్ము లేకపోయినా ఈ సదుపాయం ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఆ ఖర్చులను తిరిగి చెల్లించేందుకు 45 రోజుల వరకు గడువు ఉంటుంది, దానిపై వడ్డీ చెల్లించే పని ఉండదు. ఒకవేళ మొత్తం బకాయిని ఒకేసారి చెల్లించడం కష్టమైతే, ఆ ఖర్చును ఈఎంఐలుగా మార్చుకునే సౌకర్యం కూడా ఉంటుంది. దీంతో అనుకోకుండా వచ్చే ఖర్చులు లేదా నెలాఖరు నగదు కొరత వంటి పరిస్థితులను సులభంగా ఎదుర్కొనే అవకాశం లభిస్తుంది.

Next Story