Nirmala Sitaraman: బెంజ్‌కు, హవాయి చెప్పులకు ఒకే పన్ను కుదరదు

by S Gopi |

దేశంలోని పౌరులందరూ ఒకే స్థాయిలో అభివృద్ధి కానప్పుడు ఒకే పన్ను విధానం అమలు చేయడం అన్యాయం అవుతుంది.

Nirmala Sitaraman: బెంజ్‌కు, హవాయి చెప్పులకు ఒకే పన్ను కుదరదు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల ప్రకటించిన కొత్త జీఎస్టీ సంస్కరణలకు సంబంధించి జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో 'ఒకే దేశం-ఒకే రేటు' అంశంపై మాట్లాడుతూ.. భారత ఆర్థికవ్యవస్థ వైధ్యమైనదని, అందరికీ ఒకే పన్ను రేటు అసాధ్యమని స్పష్టం చేశారు. సామాన్యులపై పన్నుల భారాన్ని తగ్గించాలనే లక్ష్యంతో జీఎస్టీ వ్యవస్థలో తాజా సవరణలు తెచ్చినట్టు చెప్పారు. వన్ నేషన్-వన్ ట్యాక్స్ మంచి ఆలోచన అయినప్పటికీ, ఆచరణలో వీలుపడదు. దేశంలోని పౌరులందరూ ఒకే స్థాయిలో అభివృద్ధి కానప్పుడు ఒకే పన్ను విధానం అమలు చేయడం అన్యాయం అవుతుంది. మెర్సిడెస్ బెంజ్ కారు, హవాయి చెప్పులపై ఒకటే పన్ను విధించడం సాధ్యమేనా? మనదేశ వైవిధ్యానికి అభివృద్ధి చెందిన రంగాలు అధిక పన్నులు కట్టగలవు, మిగిలిన రంగాలకు అధిక పన్నులు భారంగా మారుతాయి. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించగలిగితేనే ఒకే పన్ను విధానం సాధ్యపడుతుందని ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారు.

భవిష్యత్తులో ఒక అవకాశం ఉందా?

అయితే, నిర్మలా సీతారామన్ ఈ ఆలోచనను పూర్తిగా తోసిపుచ్చలేదు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధి సమంగా మారితే, అందరి ఆదాయాలు పెరిగినప్పుడు ఏకరీతి జీఎస్టీ రేటు ఆచరణలోకి రావొచ్చని అన్నారు. బహుశా మనదేశం పూర్తిగా అభివృద్ధి చెందినప్పుడు, అది సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలను నిర్మలా సీతారామన్ తిప్పికొట్టారు. గతంలో జీఎస్టీ వ్యవస్థను గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని హేళన చేశారు. వారే ఇప్పుడు పన్ను సంస్కరణల క్రెడిట్ కోరుకుంటున్నారు. జీఎస్టీ సంస్కరణల వల్ల రాష్ట్రాలకే కాదు కేంద్రానికి కూడా కొంత ఆదాయ నష్టం ఉంటుంది. తమ ప్రభుత్వం పౌరుల అవసరాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఆ తర్వాతే ఆదాయమని అన్నారు.

జీఎస్టీ 3.0

ఈ క్రమంలో జీఎస్టీ 3.0 సంస్కరణలు కూడా ఉంటాయని నిర్మలా సీతారామన్ సంకేతమిచ్చారు. 2017లో జీఎస్టీ 1.0 దేశవ్యాప్తంగా ఒకే దేశం-ఒకే పన్ను నినాదంతో వచ్చింది, తాజాగా జీఎస్టీ 2.0 పన్ను రేట్లను సరళతరం చేసే లక్ష్యంతో తెచ్చాం. భవిష్యత్తులో జీఎస్టీ 3.0 కూడా ఉండొచ్చని అన్నారు. జీఎస్టీ 3.0లో జీఎస్టీ 2.0లో సాధించిన సరళమైన పన్ను నిర్వహణను కొనసాగిస్తూనే, దాన్ని మరింత మెరుగుపరిచేలా చేస్తామని తెలిపారు. మరో మాటలో చెప్పాలంటే.. జీఎస్టీ 3.0 స్థిరమైన, న్యాయబద్దమైన, మరింత సులభమైన పన్ను వ్యవస్థ ఉండేలా చూస్తామన్నారు. గందరగోళం లేకుండా, చిన్న వ్యాపారులపై భారం పడకుండా పన్నులను సరళంగా ఉంచడమే దీని లక్ష్యమని స్పష్టం చేశారు.

రష్యా నుంచి చమురును కొనుగోలు కొనసాగుతుంది

ఇంటర్వ్యూలో రష్యా చమురు కొనుగోలుకు సంబంధించి కేంద్ర ఆర్థిక నిర్మలా సీతారామన్ స్పందించారు. భారత అవసరాలను పరిగణలోకి తీసుకుని రష్యా చమురు కొనుగోలును కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు. అది రష్యా చమురా మరే దేశ చమురైనా భారత అవసరాలతో పాటు తాము అనుకున్న ధరలో లభిస్తే, లాజిస్టిక్స్ సమస్యలు లేకపోతే కొనాలని నిర్ణయిస్తాం. భారత్ అధికంగా విదేశీ మారకాన్ని ఖర్చు చేస్తున్నది చమురుపైనే కాబట్టి, ఎక్కడ అనువుగా చమురు దిగుమతికి అవకాశం ఉందో అక్కడ కొనాలనే నిర్ణయం భారత్‌దే. అందులో ఎటువంటి సందేహం అక్కరలేదని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. భారత నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరని స్పష్టం చేశారు.

Next Story