Banks: పండుగ సీజన్ కోసం ఆఫర్లు ప్రకటించిన బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు

by S Gopi |

చాలా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు తక్షణ ఈఎంఐ ఆప్షన్లు, క్యాష్‌బ్యాక్ డీల్స్, కొనుగోళ్లపై డిస్కౌంట్‌లను అందిస్తున్నాయి.

Banks: పండుగ సీజన్ కోసం ఆఫర్లు ప్రకటించిన బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా పండుగ సీజన్ నేపథ్యంలో వినియోగదారుల కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సైతం అనేక రకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. దీనివల్ల ఈ పండుగ సీజన్‌లో క్రెడిట్ డిమాండ్ పెరుగుతుందని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఆశిస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని గృహా, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాయి. అలాగే, ప్రాసెసింగ్ ఫీజుల మాఫీ, తిరిగి చెల్లించే కాలపరిమితిని పొడిగించాయి. అంతేకాకుండా చాలా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు రిటైలర్లు, ఈ-కామర్స్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుని తక్షణ ఈఎంఐ ఆప్షన్లు ఇవ్వడం, క్యాష్‌బ్యాక్ డీల్స్, కొనుగోళ్లపై డిస్కౌంట్‌లను అందిస్తున్నాయి.

ఉదాహరణకు ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, ఫ్యాషన్, ప్రయాణం, కిరాణా సామాగ్రి, ఆన్‌లైన్ షాపింగ్, ఫర్నిచర్, గృహాలంకరణ, డైనింగ్ వంటి అనేక విభాగాల్లో డిస్కౌంట్‌లు, క్యాష్‌బ్యాక్‌లను అందిస్తోంది. వినియోగదారులు తమ బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ లావాదేవీలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, కార్డ్‌లెస్ ఈఎంఐ లేదా కన్స్యూమర్ ఫైనాన్సింగ్‌ ద్వారా రూ. 50,000 వరకు ఆదా చేసుకోవచ్చని బ్యాంకు తెలిపింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సైతం వ్యక్తిగత, వ్యాపార, కారు, గృహ, బంగారం, వ్యవసాయ రుణాలపై రూ. 50,000 వరకు పొదుపును అందించే ఆఫర్లు ప్రకటించింది. మరో ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ నవరాత్రి, దీపావళి, క్రిస్మస్ కోసం డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్, రివార్డులు, స్పెషల్ డీల్స్ కోసం 'దిల్ సే ఓపెన్ సెలబ్రేషన్స్‌'ను ప్రారంభించింది. ఈకామర్స్, ఎలక్ట్రానిక్స్, క్విక్ షాపింగ్, ట్రావెల్‌లో కొనుగోళ్లకు ఉపయోగించే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై కస్టమర్‌లు ఆఫర్‌లను పొందుతారని వెల్లడించింది. ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ 10 శాతం తక్షణ తగ్గింపులను అందిస్తోంది. ముఖ్యంగా ప్రీమియం మొబైల్ ఫోన్ లావాదేవీలపై అదనపు తగ్గింపులు ఇస్తోంది.

ఇక, ఎన్‌బీఎఫ్‌సీలు జీఎస్టీ సంస్కరణలతో పన్ను రేట్లు తగ్గడంతో టూవీలర్ రుణాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. దసరా, దీపావళికి ముందు టైర్-2, టైర్-3 నగరాల్లో డిమాండ్ పెరుగుతుందని ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలు ఆశిస్తున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్ బంగారం, గృహ, వాహన రుణాల కోసం ప్రత్యేక పథకం తీసుకొస్తామని తెలిపింది. ఎల్అండ్‌టీ ఫైనాన్స్ ఇప్పటికే ద్విచక్ర వాహన వినియోగదారుల కోసం నో-కాస్ట్ ఈఎంఐ, తక్షణ చెల్లింపు రాయితీ, ఈఎంఐ లైట్ ఫెస్టివ్ (2025లో కొనండి, 2026లో చెల్లించండి) ప్రకటించింది.

Next Story