- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RBI: లోన్ డిఫాల్ట్ పేరుతో వేధింపులకు చెక్
రుణగ్రహీతల మొబైల్ ఫోన్లను నిలిపివేయడం లేదా వాటి ఫీచర్లను పరిమితం చేయడం బ్యాంకులు చేయకూడదని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: రుణ వసూళ్ల పేరుతో జరుగుతున్న వేధింపులను కట్టడి చేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కీలకమైన కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది. వ్యక్తిగత, కారు లేదా గృహ రుణాల బకాయిల వసూళ్ల కోసం రుణగ్రహీతల మొబైల్ ఫోన్లను నిలిపివేయడం లేదా వాటి ఫీచర్లను పరిమితం చేయడం బ్యాంకులు చేయకూడదని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. లోన్ల రికవరీ పేరుతో కస్టమర్లను వేధించే బ్యాంకులను నిలువరించేందుకు ఈ కఠిన నిబంధనలను ప్రతిపాదించింది. దీనికి సంబంధించి ‘కండక్ట్ ఆఫ్ రెగ్యులేటెడ్ ఎంటిటీస్ ఇన్ రికవరీ ఆఫ్ లోన్స్ అండ్ ఎంగేజ్‌మెంట్ ఆఫ్ రికవరీ ఏజెంట్స్’ ముసాయిదా నిబంధనలను తెచ్చింది. వీటిపై ఈ నెలాఖరు 31 వరకు వాటాదారులు, ప్రజల అభిప్రాయాలు చెప్పాలని కోరింది. ఈ కొత్త నిబంధనలు ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమలు చేయనున్నట్టు పేర్కొంది. ఇటీవల రికవరీ ఏజెంట్లు దుర్భాషలాడటం, పదేపదే కాల్స్ చేయడం, సోషల్ మీడియాలో కూడా రుణగ్రహీతలను వేధిస్తున్నారనే ఫిర్యాదులు పెరగడంతో ఆర్‌బీఐ ఈ సవరించిన ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఫోన్ బ్లాక్ చేయద్దు
కస్టమర్లు సకాలంలో తిరిగి చెల్లింపులు చేయని పక్షంలో మొబైల్‌ఫోన్‌ను బ్లాక్ చేయడం, అందులోని ఫీచర్లను ఆపడం లాంటి పనులు బ్యాంకులు చేయకూడదని తెలిపింది. ఒకవేళ సదరు మొబైల్ ఫోన్ లేదా టాబ్లెట్ కొనుగోలు చేయడానికి బ్యాంకు నుంచే లోన్ తీసుకుని ఉంటే, ఆ సమయంలో మాత్రమే ఫోన్‌లోని ఫీచర్లను నిలిపివేసేందుకు బ్యాంకుకు అవకాశం ఉంటుంది. అది కూడా ఫైనాన్స్ చేసిన పరికరాల విషయంలో 90 రోజులకుపైగా డిఫాల్ట్‌లో ఉన్నప్పుడు మాత్రమే దీన్ని అనుసరించాలని స్పష్టం చేసింది. అయినప్పటికీ, ఇంటర్నెట్ యాక్సెస్, ఇన్‌కమింగ్ కాల్స్, ఎస్ఓఎస్ ఫీచర్లు, ప్రభుత్వ అత్యవసర నోటిఫికేషన్లు వంటి కీలక సేవలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయకూడదని వెల్లడించింది. ఆ తర్వాత రుణగ్రహీత బకాయిలు చెల్లించిన గంటలోపే పరిమితులను తొలగించాలని, ఆలస్యమైతే గంటకు రూ. 250 చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.
బెదిరింపులు, పదేపదే కాల్స్‌పై కఠిన ఆంక్షలు
రికవరీ ప్రక్రియలో బ్యాంకులు, రికవరీ ఏజెంట్ల ప్రవర్తనపై కూడా ఆర్‌బీఐ కఠిన నిబంధనలు ప్రతిపాదించింది. రికవరీ సమయంలో చేసిన కాల్స్ సమయంతో సహా అన్ని వివరాలు రికార్డ్ చేయాలని సూచించింది. బెదిరింపులు, దూషణలు, సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు పోస్ట్ చేయడం, అనుచితంగా మెసేజ్‌లు పంపడం, కాల్స్ లేదా మెసేజ్‌లతో వేధించడం వంటివి చేయకూడదని పేర్కొంది. ఈ నిబంధనలు ఉల్లంఘించే రికవరీ ఏజెంట్లపై తీసుకునే చర్యలను కూడా బ్యాంకులు స్పష్టంగా రూపొందించాలని వివరించింది.






