- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bank Union: 27న దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్న బ్యాంకు ఉద్యోగులు
ముఖ్యంగా బ్యాంకింగ్ పరిశ్రమలో ఐదు రోజుల పని దినాలను డిమాండ్ చేస్తూ సుమారు 8 లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెకు సిద్ధమవుతున్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకింగ్ యూనియన్లు ఈ నెల 27న సమ్మెకు దిగనున్నట్టు ప్రకటించాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ పరిశ్రమలో ఐదు రోజుల పని దినాలను డిమాండ్ చేస్తూ సుమారు 8 లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ సమ్మెలో ప్రభుత్వ రంగ, ప్రైవేట్, విదేశీ, ప్రాంతీయ గ్రామీణ, సహకార బ్యాంకుల ఉద్యోగులు పాల్గొంటారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ)తో సహా తొమ్మిది బ్యాంక్ ఉద్యోగుల, అధికారుల సంఘాల కూటమి యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. నెలలో అన్ని శనివారాలను బ్యాంకు సెలవులుగా ప్రకటించడానికి ఆమోదించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తున్నందున యూనియన్లు ఈ సమ్మెను నిర్వహిస్తున్నాయని ఏఐబీఓసీ పేర్కొంది. అంతేకాకుండా ఐదు రోజుల పని వారానికి సంబంధించి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సిఫార్సు గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వ పరిశీలనలో పెండింగ్‌లో ఉందఅని ఉద్యోగులు తెలిపారు. ఈ ప్రతిపాదన 2023, డిసెంబర్ 7న యూఎఫ్‌బీయూ, ఐబీఏ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలో భాగమని, ఆ తర్వాత 2024, మార్చి 8 నాటి సెటిల్‌మెంట్, జాయింట్ నోట్‌లో దీనిని పేర్కొన్నట్టు యూనియన్లు వెల్లడించాయి. ఈ ప్రతిపాదన ప్రకారం, సోమవారం నుంచి శుక్రవారం వరకు పని గంటలను 40 నిమిషాలు పెంచుతారు, అయితే అన్ని శనివారాలను సెలవు రోజులుగా ప్రకటిస్తారు.






