Bank of India: రుణ రేట్లను తగ్గించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా

by S Gopi |

సవరించిన వడ్డీ రేట్లు ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు వెల్లడించింది.

Bank of India: రుణ రేట్లను తగ్గించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఇళ్ల రుణాలకు సంబంధించి వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అధిక స్బిల్ స్కోర్ ఉన్న రుణగ్రహీతలకు వడ్డీని ఏడాదికి 8.10 శాతం నుంచి 7.90 శాతానికి తగ్గించింది. సవరించిన వడ్డీ రేట్లు ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి వస్తాయని, ఈ రేట్లు ఇప్పటికే రుణాలు తీసుకున్న వారితో పాటు కొత్తగా తీసుకునేవారికి కూడా వర్తిస్తుందని బ్యాంకు వెల్లడించింది. ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కీలక రెపో రేటును 6 శాతానికి తగ్గిస్తూ ప్రకటన ఆధారంగా బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించడం వల్ల హోమ్ లోన్‌లతో పాటు, వాహన, వ్యక్తిగత, విద్య, ఆస్తి రుణాలు సహా పలు రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లు 25 బేసిస్ పాయింట్లు మేర తగ్గనున్నాయి. ప్రైవేట్ పెట్టుబడులను పునరుద్ధరించడానికి, దేశీయ డిమాండ్‌ను మెరుగుపరిచేందుకు ఆర్‌బీఐ రేట్ల్ను తగ్గించడం ద్వారా రుణ ప్రక్రియను సులభతరం చేసింది.

ఇదే సమయంలో తన ఫిక్స్ డిపాజిట్(ఎఫ్‌డీ) రేట్లపై కూడా వడ్డీ రేట్లను సవరించింది. అలాగే, 400 రోజుల కాలవ్యవధితో కూడిన స్పెషల్ ఎఫ్‌డీ పథకాన్ని ముగిస్తున్నట్టు అధికారిక ప్రకటనలో తెలిపింది. సవరించిన వడ్డీ రేట్లు, నిర్ణయాలు ఏప్రిల్ 15 నుంచి అమలవనున్నట్టు బ్యాంక్ స్పష్టం చేసింది. 7.30 శాతం అధిక వడ్డీతో కస్టమర్ల కోసం తీసుకొచ్చిన 400 రోజుల స్పెషల్ ఎఫ్‌డీ పథకాన్ని బ్యాంకు నిలిపేసింది. ఇతర డిపాజిట్లకు సంబంధించి.. 91 రోజుల నుంచి 179 రోజుల కాలవ్యవధి కలిగిన డిపాజిట్లపై వడ్డీని 4.50 శాతం నుంచి 4.25 శాతానికి తగ్గించింది. 180 రోజుల నుంచి ఏడాది కాలానికి 6 శాతం నుంచి 5.75 శాతానికి తగ్గించింది. ఏడాది కాలవ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై వడ్డీని 20 బేసిస్ పాయింట్లు తక్కువగా 6.80 శాతానికి కుదించింది.

Next Story