BoB: డార్క్ వెబ్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా డేటా

by S Gopi |

ఈ డేటాలో లక్షలాది మంది కస్టమర్ల పేర్లు, మొబైల్ నంబర్లు, ఆధార్ వివరాలతో పాటు బ్యాంక్ అంతర్గత ఆడిట్ నివేదికలు ఉన్నట్లు సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు తెలిపారు.

BoB: డార్క్ వెబ్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా డేటా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) తీవ్రమైన సైబర్ భద్రతా సవాళ్లను ఎదుర్కొంటోంది. బ్యాంక్ సర్వర్ల నుంచి సుమారు 1 టెరాబైట్ (1టీబీ) సమాచారాన్ని దొంగిలించి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచామని ఒక హ్యాకర్ ప్రకటించడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ డేటాలో లక్షలాది మంది కస్టమర్ల పేర్లు, మొబైల్ నంబర్లు, ఆధార్ వివరాలు, సేవింగ్స్, కరెంట్ అకౌంట్ల సమాచారం, లోన్ రికార్డులతో పాటు బ్యాంక్ అంతర్గత ఆడిట్ నివేదికలు ఉన్నట్లు సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు తెలిపారు. అయితే పాస్‌వర్డ్‌లు, పిన్‌లు, యూపీఐ కోడ్‌లు లేదా ఓటీపీలు లీక్ అయినట్లు ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ, కస్టమర్ వివరాలు బహిర్గతం కావడం పెద్ద చర్చకు దారితీసింది.

బ్యాంకు అధికారిక వివరణ

ఈ నివేదికలపై స్పందించిన బ్యాంక్ ఆఫ్ బరోడా యాజమాన్యం, తమ వద్ద అత్యంత భద్రమైన సైబర్ ప్రోటోకాల్స్ ఉన్నాయని స్పష్టం చేసింది. ఒక ఉద్యోగికి చెందిన ఈమెయిల్ అకౌంట్ హ్యాక్ కావడం వల్ల మాత్రమే కొంత సమాచారం అనధికారికంగా యాక్సెస్ అయ్యిందని, ఆ ముప్పును వెంటనే పసిగట్టి నిరోధక చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. అత్యంత కీలకమైన 'కోర్ బ్యాంకింగ్ సిస్టమ్స్' సురక్షితంగా ఉన్నాయని, ప్రధాన సర్వర్లలోకి హ్యాకర్లు ప్రవేశించలేదని బ్యాంక్ భరోసా ఇచ్చింది. ఈ ఘటనపై సమగ్ర ఫొరెన్సిక్ విచారణ ప్రారంభించడమే కాకుండా, ఆర్‌బీఐ, సెర్ట్-ఇన్ వంటి నియంత్రణ సంస్థల మార్గదర్శకాలను పాటిస్తూ దర్యాప్తు వేగవంతం చేసినట్లు తెలిపింది.

పెరుగుతున్న ఫిషింగ్ ప్రమాదం

అధికారికంగా 1 టీబీ డేటా లీక్ వ్యవహారంపై పూర్తి స్థాయిలో ఇంకా ధృవీకరించనప్పటికీ, కస్టమర్ల వ్యక్తిగత వివరాలు సైబర్ కేటుగాళ్ల చేతికి చిక్కితే 'టార్గెటెడ్ ఫిషింగ్' దాడులు పెరిగే ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్యాంక్ ప్రతినిధులుగా నమ్మిస్తూ నకిలీ ఎస్సెమ్మెస్‌లు, ఇ-మెయిళ్లు లేదా ఫోన్ కాల్స్ చేసి ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు రాబట్టడానికి మోసగాళ్లు ప్రయత్నించవచ్చు. అంతేకాకుండా ఆధార్, బ్యాంక్ వివరాలతో నకిలీ లోన్ దరఖాస్తులు లేదా ఫోర్జరీ కేవైసీల రూపంలో 'ఐడెంటిటీ థెఫ్ట్' జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు ఎవరితోనూ వ్యక్తిగత పిన్, ఓటీపీ వివరాలను పంచుకోకుండా అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

Next Story