- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Banking Union: జనవరి 27న దేశవ్యాప్త సమ్మెకు బ్యాంకు ఉద్యోగుల సంఘాలు
వరుసగా మూడు రోజుల పాటు ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకు కార్యకలాపాలపై గణనీయమైన ప్రభావం పడనుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలోని బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు 5 రోజుల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 27న దేశవ్యాప్త సమ్మెకు దిగుతామని హెచ్చరించాయి. ఒకవేళ సమ్మె జరిగితే, జనవరి 25, 26 తేదీలు సెలవులు కావడంతో, వరుసగా మూడు రోజుల పాటు ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకు కార్యకలాపాలపై గణనీయమైన ప్రభావం పడనుంది. ప్రస్తుతం, బ్యాంకు ఉద్యోగులకు ఆదివారాలతో పాటు ప్రతి నెలా రెండో, నాలుగో శనివారాల్లో సెలవు అమలవుతోంది. మిగిలిన రెండు శనివారాలను కూడా సెలవులుగా ప్రకటించడానికి 2024, మార్చిలో వేతన సవరణ ఒప్పందం సందర్భంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), యూఎఫ్‌బీయూ మధ్య అంగీకారం కుదిరింది. తమ న్యాయమైన డిమాండ్‌కు ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరం. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజూ అదనంగా 40 నిమిషాలు పనిచేయడానికి మేము అంగీకరించినందున, పని గంటల నష్టం ఏమీ ఉండదని యూఎఫ్‌బీయూ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ఆర్‌బీఐ, ఎల్‌ఐసీ, జీఐసీ మొదలైనవి వారానికి 5 రోజులు పనిచేస్తున్నాయని, విదేశీ మారక ద్రవ్య మార్కెట్, ద్రవ్య మార్కెట్, స్టాక్ ఎక్స్ఛేంజీలు మొదలైనవి శనివారాల్లో పనిచేయడం లేదని యూఎఫ్‌బీయూ పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు కూడా శనివారాల్లో పనిచేయవని తెలిపింది. ఈ క్రమంలో బ్యాంకులు 5 రోజుల పని వారాన్ని ప్రవేశపెట్టకపోవడానికి ఎటువంటి కారణం లేదని వెల్లడించింది.






