సిటీ బ్యాంక్ కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసిన యాక్సిస్ బ్యాంక్!

by Disha Web Desk 17 |
సిటీ బ్యాంక్ కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసిన యాక్సిస్ బ్యాంక్!
X

న్యూఢిల్లీ: గత ఏడాది 121 ఏళ్ల చరిత్ర కలిగిన సిటీ బ్యాంకును కొనుగోలు చేసిన యాక్సిస్ బ్యాంక్ దానికి సంబంధించి ప్రక్రియను పూర్తిచేసింది. సిటీ బ్యాంక్ తన భారత వినియోగదారు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ వ్యాపారాలను 2022, మార్చిలో యాక్సిస్ బ్యాంకుకు విక్రయించింది. సరిగ్గా ఏడాది తర్వాత ఈ ఒప్పంద ప్రక్రియ పూర్తిగా ముగిసింది. దీంతో మార్చి 1 నుంచి సిటీ బ్యాంకుకు చెందిన అన్ని వ్యాపారాలు యాక్సిస్ బ్యాంక్ అధీనంలోకి వెళ్లాయి.

దేశీయంగా వందేళ్లకు పైగా సేవలందించిన సిటీ బ్యాంకు తన అంతర్జాతీయ వ్యాపారంపై దృష్టి సారించేందుకు గానూ భారత్‌లోని వ్యాపారాన్ని విక్రయించింది. మరో 12 దేశాల్లో సైతం ఇదే నిర్ణయం తీసుకుంది. తన రిటైల్ బ్యాంకింగ్ వ్యవహారాలను వదిలి కేవలం వెల్త్ మేనేజ్‌మెంట్ కార్యకలాపాలపై దృష్టి సారిస్తామని సంస్థ స్పష్టం చేసింది. దాంతో సిటీ బ్యాంక్ భారత వ్యాపారాలను యాక్సిస్ బ్యాంకు రూ. 11,600 కోట్లకు కొనుగోలు చేసింది.

తద్వారా సిటీ బ్యాంకు పరిధిలోని మొత్తం 3,500 మంది ఉద్యోగులు యాక్సిస్ బ్యాంకుకు మారారు. అదేవిధంగా సిటీ బ్యాంకుకు చెందిన 7 ఆఫీసులు, 21 బ్యాంకు శాఖలు, 499 ఏటీఎంలు యాక్సిస్ బ్యాంకుకు దక్కాయి. దాదాపు 25 లక్షల సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులు యాక్సిస్ బ్యాంక్ కిందకు మారనున్నారు.

సిటీ బ్యాంక్ వినియోగదారులు ఇప్పటిలాగే సేవలు వినియోగించుకోవచ్చని, మార్చి 1 నుంచి సంస్థ యాజమాన్య హక్కులు మాత్రమే యాక్సిస్ బ్యాంకుకు బదిలీ అవుతాయని వెల్లడించింది. సిటీ బ్యాంకు అకౌంట్, క్రెడిట్-డెబిట్ కార్డులు, చెక్‌బుక్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లన్నీ యథాతథంగా ఉంటాయి. బ్యాంకు యాప్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ అన్ని సేవలు మునుపటిలాగే కొనసాగుతాయని యాక్సిస్ బ్యాంకు స్పష్టం చేసింది. సిటీ బ్యాంకు నుంచి బీమా తీసుకొని ఉంటే ఇక మీద అది యాక్సిస్ బ్యాంకు ద్వారా సేవలందుతాయి. కొత్త డిపాజిట్లకు మాత్రం యాక్సిస్ బ్యాంకు వడ్డీ రేట్లు అమలవుతాయని పేర్కొంది.



Next Story

Most Viewed