- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
FADA: 2025లో 8 శాతం పెరిగిన వాహన రిటైల్ అమ్మకాలు
మొత్తం అమ్మకాల్లో ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 40,79,532 యూనిట్లతో 9.7 శాతం వృద్ధి చెందాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ వాహన పరిశ్రమలో రిటైల్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయని ఆటోమొబైల్ డీలర్ల సంఘం ఫాడా మంగళవారం ప్రకటనలో వెల్లడించింది. 2025లో దేశవ్యాప్తంగా మొత్తం 2,81,61,228 యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయి. ఇది 2024లో అమ్ముడైన 2,61,45,445 యూనిట్లతో పోలిస్తే 7.71 శాతం అధికం. దీనికి కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన జీఎస్టీ 2.0 సంస్కరణలు భారీ అమ్మకాలకు దోహదపడ్డాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్(ఫాడా) అభిప్రాయపడింది. మొత్తం అమ్మకాల్లో ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 40,79,532 యూనిట్లతో 9.7 శాతం వృద్ధి చెందాయి. ఆ తర్వాత టూవీలర్ విభాగంలో 2,02,95,650 యూనిట్లు(7.24 శాతం వృద్ధి), త్రీ-వీలర్ రిటైల్ అమ్మకాలు 13,09,953 యూనిట్లు(7.21 శాతం వృద్ధి), కమర్షియల్ వాహనాల విభాగం 10,09,654 యూనిట్ల(6.71 శాతం వృద్ధి) విక్రయాలు నమోదయ్యాయి. కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యక్ష పన్నుల ఉపశమనం, 2025 ఏడాది పొడవునా ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్ల కోత వంటి కీలక చర్యలు అమ్మకాలకు మద్దతిచ్చాయని ఫాడా అధ్యక్షుడు సీఎస్ విఘ్నేశ్వర్ అన్నారు.
గతేడాది ప్యాసింజర్ వాహనాల విక్రయాలకు గ్రామీణ మార్కెట్ ఎక్కువ సహకారం అందించింది. ఈ విభాగంలో పట్టణ ప్రాంత అమ్మకాలు 8 శాతం పెరగ్గా, గ్రామీణ ప్రాంతాల్లో 12 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాలలో దాదాపు 33 శాతం సీఎన్‌జీ, హైబ్రిడ్లు, ఈవీ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలు ఉన్నాయి. సీఎన్‌జీ అమ్మకాలు 18 శాతం నుంచి 21 శాతానికి పెరగ్గా, ఈవీలు 2.4 శాతం నుంచి 4 శాతానికి పెరిగాయి. అయితే హైబ్రిడ్లు 8.7 శాతం నుంచి 8.2 శాతానికి తగ్గాయని ఫాడా పేర్కొంది.






