Ather Energy: ఈ నెల 28న ఐపీఓకు వస్తున్న ఏథర్ ఎనర్జీ

by S Gopi |

ఐపీఓ నిధులను కంపెనీ మహారాష్ట్రలో తన ఫ్యాక్టరీ ఏర్పాటు, రుణాలను తగ్గించుకునేందుకు వాడనున్నట్టు స్పష్టం చేసింది.

Ather Energy: ఈ నెల 28న ఐపీఓకు వస్తున్న ఏథర్ ఎనర్జీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: గత కొన్ని వారాలుగా భారత స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిణామాలను గమనించిన చాలా కంపెనీలు ఐపీఓల కోసం ఈక్విటీ మార్కెట్లలో అడుగుపెట్టేందుకు సంకోచిస్తున్నాయి. ఈ క్రమంలోనే గత కొద్దికాలంగా ఐపీఓకు రావాలని చూస్తున్న ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ ఎట్టకేలకు ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ నెల 28న ఐపీఓ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. అయితే, మరోసారి తన ఐపీఓ పరిమాణాన్ని కంపెనీ తగ్గించింది. మొదట్లో రూ. 3,500-3,700 కోట్ల నిధులను సమీకరించనున్నట్టు ప్రకటించిన తర్వాత, దాన్ని రూ. 3100 కోట్లకు తగ్గించింది. అనంతరం గత కొన్ని వారాలుగా నెలకొన్న అంతర్జాతీయ పరిణామాలు, దేశీయంగా ఈక్విటీ మార్కెట్లపై పడుతున్న ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని మంగళవారం ప్రకటనలో రూ. 2,626 కోట్లను సేకరిస్తామని తెలిపింది. దీంతో పాటు 1.1 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో విక్రయించనుంది. ఐపీఓ ప్రక్రియ ద్వారా సేకరించిన నిధులను కంపెనీ మహారాష్ట్రలో తన ఫ్యాక్టరీ ఏర్పాటు, రుణాలను తగ్గించుకునేందుకు వాడనున్నట్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా కొంత మొత్తం నిధులను కంపెనీ ఆర్అండ్‌డీ అవసరాల కోసం ఖర్చు చేయనుంది. గతేడాది అతిపెద్ద ఈవీ టూవీలర్ కంపెనీ ఓలా ఐపీఓకు వచ్చిన సంగతి తెలిసిందే. కంపెనీ రూ. 6 వేల కోట్లకు పైగా నిధులను మార్కెట్ల నుంచి సేకరించింది. ఓలా తర్వాత ఐపీఓకు వస్తున్న ఈవీ కంపెనీలు ఏథర్ ఎనర్జీయే కావడం గమనార్హం. కంపెనీ ఐపీఓ ప్రక్రియ ఈ నెల 28-30 మధ్య జరగనుంది. ఇతర వివరాలు ఈ వారంలోగా వెల్లడించనున్నట్టు కంపెనీ పేర్కొంది.

Next Story