- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Deta Centre: డేటా సెంటర్ల దాహం
డేటా సెంటర్లలో సర్వర్లను చల్లబరచడానికి భారీగా నీటిని వినియోగించాల్సి రావడంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్ వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ డిజిటల్ విప్లవానికి బలమైన వెన్నెముకగా నిలుస్తున్నవి డేటా సెంటర్లు. అయితే ఈ వృద్ధి వెనుక దాగి ఉన్న పర్యావరణ ఖర్చు ఉంది, అదే నీటి వినియోగం. డేటా సెంటర్లలో సర్వర్లను చల్లబరచడానికి భారీగా నీటిని వినియోగించాల్సి రావడంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాట్‌కనెక్ట్ ఫౌండేషన్ తాజా అంచనాల ప్రకారం, దేశీయంగా డేటా సెంటర్లు ఏటా సుమారు 37.5 బిలియన్(3,750 కోట్ల) లీటర్ల నీటిని వినియోగించే అవకాశం ఉంది. ఇది సుమారు 7–8 లక్షల మంది ప్రజల వార్షిక అవసరాలకు సమానం, లేదా ముంబై వంటి మహానగరానికి వారం రోజుల నీటి సరఫరా అందించగల పరిమాణం. ఈ లెక్కలు పట్టణ నీటి వినియోగానికి సెంట్రల్ పబ్లిక్ హెల్త్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ ఆర్గనైజేషన్ నిర్దేశించిన రోజుకు తలసరి 135 లీటర్ల ప్రమాణాన్ని ఆధారంగా తీసుకుని రూపొందించినవి.
విస్తరణతో పాటే పెరుగుతున్న ఒత్తిడి
ఏఐ, డిజిటల్ సేవల విస్తరణతో దేశంలో డేటా సెంటర్ సామర్థ్యం గణనీయంగా పెరిగింది. 2020లో సుమారు 375 మెగావాట్లుగా ఉన్న సామర్థ్యం, 2025 నాటికి 1,500 మెగావాట్లకు పైగా పెరిగింది. ఈ వృద్ధి డేటా వినియోగం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్తరణ, డేటా లోకలైజేషన్ విధానాల వల్ల మరింత వేగవంతంగా జరుగుతోంది. అయితే, ఈ విస్తరణకు నీటి వినియోగం ప్రధాన సవాలుగా మారుతోంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం, సంప్రదాయ పద్ధతిలో పనిచేసే 1 మెగావాట్ డేటా సెంటర్ ఏటా దాదాపు 25 మిలియన్(2.5 కోట్ల) లీటర్ల నీటిని వినియోగించవచ్చు. దీన్ని బట్టి పెద్ద స్థాయి డేటా సెంటర్ క్లస్టర్లలో నీటి వినియోగం ఎంత భారీగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
నీటి భద్రతపై పెరుగుతున్న ఆందోళనలు
ప్రపంచ జనాభాలో దాదాపు 18 శాతం మంది భారత్‌లోనే ఉంది. కానీ, అందుబాటులో ఉన్న మంచినీటి వనరులు కేవలం 4 శాతం మాత్రమే. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గుతున్నాయి. వ్యవసాయం ఇప్పటికీ భారీగా భూగర్భ జలాలపై ఆధారపడుతుండటం పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తోంది. ఇలాంటి సమయంలో డేటా సెంటర్లకు పెరుగుతున్న నీటి అవసరం దేశ నీటి భద్రతకు అదనపు ఒత్తిడిగా మారుతుందని నాట్‌కనెక్ట్ ఫౌండేషన్ డైరెక్టర్ బీ ఎన్ కుమార్ హెచ్చరిస్తున్నారు. ఏఐ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో నీటి నిర్వహణను ప్రణాళికలో భాగంగా చేర్చాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వ పరిష్కారాలు
ఈ ఆందోళనలను గమనించిన కేంద్ర ప్రభుత్వం నీటి వినియోగాన్ని తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది. జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకారం, ఆధునిక డేటా సెంటర్లు ఇప్పుడు అధునాతన కూలింగ్ టెక్నాలజీలను విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. అందులో డైరెక్ట్-టూ-చిప్ లిక్విడ్ కూలింగ్, ఇమ్మెర్షన్ కూలింగ్ సిస్టమ్స్, ఎడియబెటిక్ కూలింగ్, హై-డెన్సిటీ సర్వర్ ర్యాక్స్ టెక్నాలజీలను వాడుతున్నారు. ఇవి అధిక పనితీరును కొనసాగిస్తూ, నీరు, ఎనర్జీ వినియోగాన్ని చాలావరకు తగ్గిస్తాయి.
నిపుణులు కూడా కొన్ని పరిష్కారాలు సూచిస్తున్నారు. సాంప్రదాయ నీటి ఆధారిత కూలింగ్‌కు బదులుగా క్లోజ్డ్-లూప్ కూలింగ్ సిస్టమ్స్ వినియోగం, శుద్ధి చేసిన మురుగునీటి పునర్వినియోగం, వర్షపు నీటి సేకరణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, నీటి వినియోగంపై పారదర్శక నివేదికలను పేర్కొంటున్నారు. అదనంగా, పెద్ద డేటా సెంటర్ క్లస్టర్ల కోసం ప్రాంతీయ స్థాయిలో హైడ్రోలాజికల్ అసెస్‌మెంట్ కూడా అవసరమని సూచిస్తున్నారు.
భవిష్యత్తు గురించి
డేటా సెంటర్ రంగం భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు కీలకం. అయితే, ఈ వృద్ధి సుస్థిరంగా ఉండాలంటే నీటి వినియోగంపై కఠిన నియంత్రణలు, స్మార్ట్ టెక్నాలజీలు, బాధ్యతాయుత విధానాలు అవసరం. సరైన చర్యలు తీసుకుంటే, నీటిని సమర్థవంతంగా వాడుకుంటే డేటా సెంటర్ల అభివృద్ధిలో భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదగగలదు. లేకపోతే, డిజిటల్ వృద్ధి నీటి సంక్షోభాన్ని మరింత పెంచే ప్రమాదం ఉందని నాట్‌కనెక్ట్ ఫౌండేషన్ పేర్కొంది.






