- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Personal Loan: వైద్య అవసరాలకూ వ్యక్తిగత రుణమే
మనదేశంలో భీమా కవరేజ్ ఇప్పటికీ అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితుల కోసం ఎక్కువ మంది వ్యక్తిగత రుణాల వైపు మొగ్గు చూపుతున్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం చాలామందికి లోన్లు, క్రెడిట్ కార్డుల రూపంలో అప్పులు ఏదొక రూపంలో దొరుకుతూనే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఆదాయాన్ని మించి ఖర్చులు ఎదురైనప్పుడు ఎక్కువమంది ఈ అప్పుల వంకే చూస్తున్నారు. ఇదే సమయంలో ఆర్థికంగా జాగ్రత్తగా ఉండే కుటుంబాల్లో కూడా అకస్మాత్తుగా ఆసుపత్రికి వెళ్లే పరిస్థితులు ఎదురైతే భయాందోళనకు గురవుతారు. ఇటీవల కాలంలో వైద్య ఖర్చులు ఆదాయాల కంటే వేగంగా పెరుగుతున్నాయి. మనదేశంలో భీమా కవరేజ్ ఇప్పటికీ అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితుల కోసం ఎక్కువ మంది వ్యక్తిగత రుణాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో వైద్య ఖర్చుల కోసం వ్యక్తిగత రుణాలు తీసుకునే వారి సంఖ్య అత్యధికంగా ఉందని పైసాబజార్ నివేదిక తెలిపింది. ఈ ధోరణి క్రమంగా పెరుగుతోంది.
అనారోగ్యం ఆర్థిక భారంగా మారినప్పుడు
‘ది పర్సనల్ లోన్ స్టోరీ’ పేరుతో పైసాబజార్ రూపొందించిన నివేదిక ప్రకారం, అర్బన్ ప్రాంతాల్లోని వారు వ్యక్తిగత రుణాలు తీసుకోవడానికి ప్రధానంగా వైద్య అత్యవసర పరిస్థితులే అని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా 11 శాతం మంది రుణగ్రహీతలు అత్యవసరంగా ఆసుపత్రి ఖర్చుల కోసం వ్యక్తిగత రుణాలనే ఆశ్రయిస్తున్నారు. టైర్ 1 నగరాల్లో ఈ సంఖ్య 14 శాతనికి చేరింది. ఇది ప్రస్తుత తరం ఎదుర్కొంటున్న కఠిన వాస్తవానికి ప్రతీక. అంటే, మెరుగైన ఆసుపత్రులు, అధిక ఆదాయాలు ఉన్న నగరాల్లో కూడా, అనారోగ్యం వచ్చినప్పుడు అవసరమైన డబ్బు పర్సనల్ లోన్ కోసం చూడ్డం ఇబ్బందికర పరిస్థితే.
పెరుగుతున్న వైద్య ఖర్చులు, పరిమిత బీమా కవర్
ఈ పరిస్థితి వెనుక ఉన్న ప్రధాన కారణం వైద్య ఖర్చులు బాగా పెరగడమే. దేశంలో వైద్య ద్రవ్యోల్బణం ఏటా 12–15 శాతంగా ఉంటోంది, ఇది ఆసియాలోనే అత్యధికం. చిన్న నగరాల్లో చికిత్స ఖర్చులు కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, పొదుపు, బీమా కవరేజీలో అంతరాలు మరో రకమైన కష్టాలను ముందుకు తెస్తున్నాయి.
ఆరోగ్య బీమా కవరేజీ పెరుగుతున్నప్పటికీ, దానివల్ల లభించే రక్షణ పరిమితంగానే ఉంది. భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) డేటా ప్రకారం 2023–24లో దాదాపు 57.3 కోట్ల మంది ఆరోగ్య బీమా పరిధిలోకి వచ్చారు. అయినప్పటికీ, ఇది ఇప్పటికీ జనాభాలో సగానికంటే తక్కువే. దీనర్థం చాలా కుటుంబాలకు ఆరోగ్య బీమా లేకపోవడం లేదా ప్రధాన వైద్య అవసరాల సమయంలో తక్కువ బీమా కవరేజీ లభించడం కారణం కావొచ్చు.
స్వంత జేబు నుంచి చెల్లించడం
ఈ విషయంలో ప్రభుత్వ డేటా దేశీయంగా కుటుంబాలపై పడుతున్న ఒత్తిడిని ప్రస్తావించింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, 2021–22లో మొత్తం ఆరోగ్య సంరక్షణ ఖర్చులో ప్రజలు తమ స్వంత జేబు నుంచి దాదాపు 40 శాతం ఖర్చు చేశారు. మరో మాటలో చెప్పాలంటే, ఆరోగ్య సంరక్షణ కోసం ఖర్చు చేసే ప్రతి పది రూపాయలలో దాదాపు రూ. 4 నేరుగా వారి జేబు నుంచే వచ్చాయి.
పొదుపు తగ్గిపోయి, బీమా పూర్తిగా వారికి భరోసా ఇవ్వనప్పుడు, ప్రజలకు తక్కువ మార్గాలు ఉంటున్నాయి. దీంతో అధిక వడ్డీ రేట్లు ఉన్నప్పటికీ, వ్యక్తిగత రుణాలే వారికి ఏకైక మార్గంగా ఉంది.
రుణ స్వభావం
వైద్య అవసరాలు మాత్రమే వ్యక్తిగత రుణాలకు ప్రధాన కారణం కాదని నివేదిక అభిప్రాయపడింది. వ్యక్తిగత రుణాలు తీసుకోవడానికి ప్రధాన కారణాల్లో రోజువారీ ఖర్చులు, అత్యవసరంగా ఇంటి మరమ్మతులు, వివాహాలు, వేడుకలు కూడా ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు.
మరో ఆసక్తికరమైన విషయమేంటంటే, ప్రతి నలుగురిలో ఒకరు ప్రత్యామ్నాయ లోన్ ఆప్షన్లు ఉన్నప్పటికీ, వ్యక్తిగత రుణాలకే మొగ్గు చూపుతున్నారు. ఈ ప్రవర్తన జెన్‌జీల్లో ఎక్కువగా కనిపిస్తోంది.
అసలైన ప్రశ్న
వైద్య అత్యవసర పరిస్థితుల కోసం ఎక్కువ మంది వ్యక్తిగత రుణాలు తీసుకుంటున్నారు. ఇది అతిపెద్ద సమస్యగా చూడాలి. తగినంత ఆరోగ్య బీమా కవరేజీ లభించకపోవడం, ఆర్థిక ప్రణాళిక తెలియకపోవడాన్ని ఇది సూచిస్తుంది. వ్యక్తిగత రుణాలు అత్యవసర పరిస్థితుల్లో సహాయపడతాయి, కానీ అవి దీర్ఘకాలంలో ఆర్థిక ఒత్తిడిని కూడా సృష్టిస్తాయి.






