Iphone: భారత్ నుంచి 50 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లు ఎగుమతి చేసిన యాపిల్

by S Gopi |

యాపిల్ సంస్థ ఐదేళ్ల పీఎల్ఐ గడువు ముగిసేందుకు మరో 3 నెలలు ఉండగానే ఈ రికార్డును అధిగమించడం విశేషం.

Iphone: భారత్ నుంచి 50 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లు ఎగుమతి చేసిన యాపిల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ ఐఫోన్ ఎగుమతుల్లో కీలక మైలురాయిని అధిగమించింది. 2025, డిసెంబర్ నాటికి భారత్ నుంచి ఐఫోన్ ఎగుమతులు 50 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 4.51 లక్షల కోట్ల) మార్కును చేరాయి. కేంద్ర ప్రభుత్వం అందించే స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకం ద్వారా యాపిల్ ఈ ఘనతను సాధించింది. యాపిల్ సంస్థ ఐదేళ్ల పీఎల్ఐ గడువు ముగిసేందుకు మరో 3 నెలలు ఉండగానే ఈ రికార్డును అధిగమించడం విశేషం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లోనే ఐఫోన్ ఎగుమతులు దాదాపు 16 బిలియన్ డాలర్లు(రూ. 1.45 లక్షల కోట్లు)గా ఉన్నాయని, పీఎల్ఐ పథకం ముగిసే సమయానికి 50 బిలియన్ల మార్కును దాటి ఎగుమతులు నమోదవుతాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఇదే సమయంలో(2020-21 నుంచి 2024-25) మరో స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ 17 బిలియన్ డాలర్ల(రూ. 1.53 లక్షల కోట్ల) విలువైన ఎగుమతులను నమోదు చేసింది.

భారత స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో సింహభాగం ఐఫోన్‌లదే. మనదేశం నుంచి ఎగుమతి అయ్యే మొత్తం స్మార్ట్‌ఫోన్‌లలో దాదాపు 75 శాతం ఐఫోన్‌లే కావడం గమనార్హం. దీనివల్ల మొబైల్‌ఫోన్ తయారీలో భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా మారింది. ప్రస్తుతం దేశీయంగా విక్రయించే 99 శాతానికి పైగా మొబైల్‌ఫోన్లు 'మేడ్ ఇన్ ఇండియా' కావడం విశేషం. ఐఫోన్‌లకు సంబంధించి కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం, గతేడాది మొదటి 11 నెలల్లో ఏకంగా 65 లక్షల ఐఫోన్ 16 మోడళ్లను విక్రయించింది.

Next Story