త్వరలో 'మేడ్ ఇన్ ఇండియా' ఐఫోన్ 14 .!

by Disha Web Desk 16 |
త్వరలో మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్ 14 .!
X

చెన్నై: గ్లోబల్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ యాపిల్ దేశీయంగా తన సరికొత్త ఐఫోన్ 14 అసెంబ్లింగ్ ప్రక్రియను ప్రారంభించినట్టు సోమవారం ప్రకటించింది. త్వరలో భారత్‌లోనే ఐఫోన్ 14 తయారీ చేపట్టాలని నిర్ణయించినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. యాపిల్‌ ఫోన్‌లను తయారు చేసే ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో అసెంబ్లింగ్ ప్రక్రియ మొదలైందని, దీనివల్ల ఐఫోన్ 14 గ్లోబల్ లాంచ్ తర్వాత తక్కువ వ్యవధిలోనే భారత్‌లో అసెంబ్లింగ్ చేయడం ద్వారా కీలక మైలురాయిని సాధించినట్టు కంపెనీ అభిప్రాయపడింది.

దేశీయంగా ఐఫోన్ 14 తయారీ లక్ష్యంతో కంపెనీ ఉందని, ప్రస్తుతం యాపిల్ స్మార్ట్‌ఫోన్‌లకు చైనా అతిపెద్ద మార్కెట్‌గా ఉన్నందున, అక్కడి నుంచి భారత్‌లోని అవకాశాలను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు కంపెనీ వివరించింది. ముఖ్యంగా స్థానిక తయారీ ద్వారా ధరలు కూడా చాలావరకు తగ్గుతాయని కంపెనీ భావిస్తోంది. కరోనా మహమ్మారితో పాటు, భౌగోళిక రాజకీయ కారణాలతో ఐఫోన్‌ల తయారీని చైనా నుంచి ఇతర ప్రాంతాలకు మార్చాలని యాపిల్ భావిస్తున్న సంగతి తెలిసిందే. మొదటిసారిగా 2017లో యాపిల్ సంస్థ దేశీయంగా తన ఐఫోన్-ఎస్ఈ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కార్యకలాపాలను ప్రారంభించింది.

ప్రస్తుతం దాంతో పాటు ఐఫోన్ 12, ఐఫోన్ 13లను తయారు చేస్తోంది. తాజాగా, ఐఫోన్ 14ను కూడా స్థానికంగా ఉత్పత్తి చేయడం ద్వారా 'మేడ్ ఇన్ ఇండియా' ఫోన్‌లను వినియోగదారులకు అందించాలని చూస్తోంది. మొత్తం ఐఫోన్‌లలో 95 శాతానికి పైగా ఇప్పటికీ చైనాలోనే తయారవుతున్నాయి. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం, ప్రభుత్వం అందించే పీఎల్ఐ పథకం కింద కంపెనీ 2025-26 నాటికి మొత్తం ఉత్పత్తిలో 12 శాతం ఐఫోన్‌లను భారత్‌లో ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా ఉంది.


Next Story

Most Viewed