Xiaomi: షావోమీకి లీగల్ నోటీసులు పంపిన శాంసంగ్, యాపిల్

by S Gopi |

ప్రధానంగా యాపిల్, శాంసంగ్ కంపెనీలు తమ ఫోన్లను తక్కువగా చూపించే యాడ్స్‌ను రూపొందించడాన్ని వ్యతిరేకిస్తున్నాయి.

Xiaomi: షావోమీకి లీగల్ నోటీసులు పంపిన శాంసంగ్, యాపిల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు యాపిల్, శాంసంగ్‌లు చైనాకు చెందిన షావోమీకి లీగల్ నోటీసులు జారీ చేశాయి. షావోమీ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను తమ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లతో పోల్చి చూపుతున్నట్టు ఆరోపించాయి. యాపిల్, శాంసంగ్ వేర్వేరుగానే ఈ నోటీసులిచ్చాయి. షావోమీ ఇటీవల అనుసరిస్తున్న యాడ్స్ తమ ప్రీమియం బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే విధంగా ఉన్నాయని స్పష్టం చేశాయి. ప్రధానంగా యాపిల్, శాంసంగ్ కంపెనీలు తమ ఫోన్లను తక్కువగా చూపించే యాడ్స్‌ను రూపొందించడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. సాధారణంగా యాడ్స్‌లో ఒక బ్రాండ్ మరొక బ్రాండ్‌తో పోల్చి చూపడం సహజమే. కానీ ఈ ఏడాది షావోమీ తన యాడ్స్‌లో పరిమితి దాటి శాంసంగ్, యాపిల్ స్మార్ట్‌ఫోన్‌లను కించపరిచేలా రూపొందించింది. భారత్ లాంటి మార్కెట్లో ఇలాంటి యాడ్స్ వల్ల వ్యాపారాన్ని ప్రభావితం చేస్తాయని, దీనివల్ల తమ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినవచ్చని నోటీసుల్లో తెలిపాయి. తక్షణం షావోమీ యాడ్స్ ఆపాలని, భవిష్యత్తులోనూ ఇటువంటి యాడ్స్ చేయకూడదని, లేకపోతే చట్టపరమైన చర్యలను ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలని పేర్కొన్నాయి. షావోమీ యాడ్స్ ద్వారా శాంసంగ్, యాపిల్ బ్రాండ్లను తక్కువ చేయడం ఇదే మొదటిసారి కాదు. మార్చిలో షావోమీ 15 సిరీస్ లాంచ్ సందర్భంగా, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ కెమెరాను క్యూట్ అని, దానికటే మెరుగైన లెన్స్ ఉన్న కెమెరాను చూడాల్సిన సమయం వచ్చిందని యాడ్ చేసింది. ఆ తర్వాత ఏప్రిల్‌లో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ కెమెరా కంటే తన కొత్త షావోమీ 15 ఆల్ట్రా కెమెరా మెరుగైన పనితీరు కలిగి ఉన్నట్టు యాడ్ ఇచ్చింది.

Next Story