- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Apple: ఇక భారత్‌లోనే అన్ని ఐఫోన్‌ల తయారీ
అమెరికా మార్కెట్లలో విక్రయించే అన్ని ఐఫోన్‌లను భారత మార్కెట్లోనే తయారు చేయాలని యాపిల్ భావిస్తోంది

దిశ, బిజినెస్ బ్యూరో: ఐఫోన్‌ల తయారీకి సంబంధించి టెక్ దిగ్గజం యాపిల్ భారత మార్కెట్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇటీవల అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో యాపిల్ కంపెనీ పన్నుల భారం నుంచి తప్పుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే చైనాపై ఆధారపడటాన్ని తగ్గించి భారత్‌లో తయారీని మరైంత పెంచాలని నిర్ణయించింది. ముఖ్యంగా అమెరికా మార్కెట్లలో విక్రయించే అన్ని ఐఫోన్‌లను భారత మార్కెట్లోనే తయారు చేయాలని యాపిల్ భావిస్తోందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. దీనికోసం 2026 ఏడాదిని డెడ్‌లైన్‌గా నిర్ణయించింది. వచ్చే ఏడాది ఆఖరు నాటికి యాపిల్ యూఎస్ మార్కెట్లో అవసరమైన ఐఫోన్ తయారీ ప్రక్రియను భారత్ నుంచే నిర్వహించనుంది. యాపిల్ కాంట్రాక్ట్ తయారీదారులుగా ఉన్న ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ సాయంతో గత కొన్నేళ్లుగా యాపిల్ కంపెనీ దేశీయంగా తయారీ విస్తరిస్తోంది. ఐఫోన్ల తయారీ క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 14 శాతానికి చేరుకోగా, ఇప్పటికీ యాపిల్ 80 శాతం ఐఫోన్ల తయారీ కోసం చైనాపైనే ఆధారపడి ఉంది. అయితే, తాజాగా యూఎస్, చైనా పరస్పరం పోటీగా పన్నులు పెంచిన కారణంగా చైనా నుంచి అమెరికాకు ఎగుమతి చేయాలంటే 145 శాతం పన్నులు చెల్లించాల్సి వస్తోంది. ఇరు దేశాలు దీనిపై చర్చిస్తున్నప్పటికీ, యాపిల్ భవిష్యత్తులో సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు భారత్‌ను తయారీ కేంద్రంగా ఎంచుకోవాలని చూస్తోంది. ఇది గనక ఖరారైతే వచ్చే ఏడాది నుంచి అమెరికాలో పూర్తిగా 'మేక్ ఇన్ ఇండియా' ఐఫోన్‌లు లభించనున్నాయి.






