Smartphones: మూడు నెలల్లో 25 శాతం పెరిగిన ఐఫోన్ సరఫరా

by S Gopi |

జనవరి-మార్చి మధ్య చైనా బ్రాండ్ వీవో మొత్తం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 20 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది.

Smartphones: మూడు నెలల్లో 25 శాతం పెరిగిన ఐఫోన్ సరఫరా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఏడాది మార్చి నాటికి టెక్ దిగ్గజం యాపిల్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐఫోన్ల సరఫరా 25 శాతం పెరిగాయని సైబర్‌మీడియా రీసెర్చ్ సోమవారం ప్రకటనలో తెలిపింది. దీంతో భారత స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో ఐఫోన్ 8 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. ఇదే సమయంలో జనవరి-మార్చి మధ్య చైనా బ్రాండ్ వీవో మొత్తం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 20 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాత కొరియన్ కంపెనీ శాంసంగ్ 18 శాతం వాటాతో రెండో స్థానంలో ఉంది. 13 శాతంతో షావోమీ మూడో స్థానంలో ఉండగా, గతేడాదితో పోలిస్తే భారీగా మార్కెట్ వాటాను కోల్పోయిందని సైబర్‌మీడియా నివేదిక వివరించింది. ఈ గణాంకాలు సరసమైన, తక్కువ విలువైన స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో సవాళ్లను సూచిస్తున్నాయని నివేదిక అభిప్రాయపడింది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది, ఈ కారణంగా యాపిల్ ఐఫోన్ మార్కెట్ వాటా 8 శాతానికి చేరుకుంది. ముఖ్యంగా రూ. 50 వేల నుంచి రూ. లక్ష మధ్య లభించే ఐఫోన్ 16ఇ సహా ఐఫోన్ 16 సిరీస్ ఫోన్‌లకు ఎక్కువ గిరాకీ ఉంది. ఈ విభాగంలో కంపెనీ మార్కెట్ వాటా 28 శాతం పెరిగింది. ఆ తర్వాత రూ. లక్షకు పైగా ఉన్న అధిక ప్రీమియం విభాగంలో కంపెనీ వాటా 15 శాతానికి చేరుకుందని నివేదిక వివరించింది. ఒప్పో స్మార్ట్‌ఫోన్ గతేడాది కంటే 8 శాతం పెరిగి 12 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకోగా, మోటరోలా గతేడాది కంటే 53 శాతం ఎక్కువ అమ్మకాలను చూసింది. 5జీ స్మార్ట్‌ఫోన్ విభాగంలో 21 శాతం మార్కెట్ వాటాతో వివో అగ్రస్థానంలో ఉంటే, శాంసంగ్ 19 శాతం వాటాతో రెండో స్థానంలో ఉంది. ఇది దేశీయంగా 5జీ మొబైళ్లకు పెరుగుతున్న డిమాండ్‌కు నిదర్శనమని నివేదిక పేర్కొంది.

Next Story