Apple Pay: పేమెంట్ సేవల కోసం భారతీయ బ్యాంకులతో యాపిల్ చర్చలు

by S Gopi |

ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులతో యాపిల్ సంస్థ చర్చలు జరుపుతోంది.

Apple Pay: పేమెంట్ సేవల కోసం భారతీయ బ్యాంకులతో యాపిల్ చర్చలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: డిజిటల్ చెల్లింపులకు సంబంధించి ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న భారత మార్కెట్లో ఇప్పటికీ ఫోన్‌పే, పేటీఎమ్, భారత్‌పే లాంటి దేశీయ చెల్లింపుల యాప్‌లదే హవా. ఈ నేపథ్యంలో గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ కూడా భారత డిజిటల్ చెల్లింపుల మార్కెట్లోకి అడుగుపెట్టాలని భావిస్తోంది. ఇప్పటివరకు దీనికి సంబంధించి రూమర్లు ఉన్నప్పటికీ, తాజాగా కంపెనీ యాపిల్‌పేను ప్రారంభించేందుకు భారతీయ బ్యాంకులతో చర్చలు జరపడంతో విషయం నిర్ధారణకు వచ్చింది. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులతో యాపిల్ సంస్థ చర్చలు జరుపుతోంది. యాపిల్ గ్లోబల్ కార్డ్ కంపెనీలు మాస్టర్ కార్డ్, వీసా కంపెనీలతో కూడా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ ప్రారంభం 2026 మధ్యలో జరగవచ్చు, కానీ తేదీ ఇంకా ఫైనల్ కాలేదు. యాపిల్‌పే మొదట డెబిట్, క్రెడిట్ కార్డులకు అనుమతించాలని భావిస్తోంది. ఆ తర్వాత ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాత యూపీఐ చెల్లింపులను యాడ్ చేసే అవకాశం ఉంది. అన్ని ప్రక్రియలు విజయవంతమైతే ఈ ఏడాది మధ్య నాటికి డిజిటల్ చెల్లింపుల సేవలను ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. అయితే, ప్రస్తుతానికి ఎలాంటి ఖచ్చితమైన తేదీని ఖరారు చేయలేదు. దేశంలో కార్డ్ ఆధారిత చెల్లింపులతో పాటు, ప్రభుత్వ మద్దతున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) విధానంలో లావాదేవీలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మనదేశంలో యూపీఐ అత్యంత కీలకమైన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ. యాపిల్‌పే ద్వారా ఇప్పటికే దేశీయంగా ఆధిపత్యం ఉన్న గూగుల్‌పే, ఫోన్‌పే, అమెజాన్, పేటీఎం లాంటి దిగ్గజాలకు పోటీ తప్పదని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.

Next Story