- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Apple: 15 లక్షల ఐఫోన్‌లు తరలించిన యాపిల్
టారిఫ్‌లు అమల్లోకి వస్తే ఐఫోన్‌ల ధర భారీగా పెరుగుతాయని, దానివల్ల అమ్మకాలు తగ్గుతాయని యాపిల్ భావించింది

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ప్రభావం నుంచి తప్పించుకునేందుకు టెక్ దిగ్గజం యాపిల్ భారత్‌లో ఐఫోన్‌ల ఉత్పత్తిని గణనీయంగా పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా అలా ఉత్పత్తి చేసిన వాటిలో 600 టన్నులు లేదా 15 లక్షల ఐఫోన్‌లను భారత్ నుంచి అమెరికాకు కార్గో విమానాల్లో రవాణా చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ట్రంప్ టారిఫ్‌లు అమల్లోకి వస్తే ఐఫోన్‌ల ధర భారీగా పెరుగుతాయని, దానివల్ల అమ్మకాలు తగ్గుతాయని యాపిల్ భావించింది. ట్రంప్ టారిఫ్ చుట్టూ నెలకొన్న గందరగోళం మధ్య కంపెనీకి అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన అమెరికాలో ఐఫోన్‌ల ఇన్వెంటరీలు పెంచే వ్యూహంలో భాగంగానే యాపిల్ ఈ నిర్ణయం తీసుకుంది. ట్రంప్ ప్రభుత్వం చైనా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై 125 శాతం టారిఫ్ విధించింది. భారత ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్ ప్రకటించారు. తాజాగా చైనా మినహా మిగిలిన దేశాలపై టారిఫ్ అమలును 90 రోజులు వాయిదా వేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటనతో ఎగుమతుల విషయంలో భారత్‌కు తాత్కాలికంగా ఊరట లభించినట్టు అయింది. దీన్ని యాపిల్ సంస్థ సద్వినియోగం చేసుకుంది. దేశంలోని అన్ని తయారీ కేంద్రాల నుంచి ఐఫోన్‌లను వేగంగా అమెరికాకు రవాణా చేసింది. ఆరు విమానాల్లో ఐఫోన్లను అమెరికాకు ఎగుమతి చేసింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఐఫోన్ అమ్మకాల్లో ఐదో వంతు భారత్‌లో తయారవుతున్నాయి.






