- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Apple: మార్చిలో 2 బిలియన్ డాలర్ల ఐఫోన్లు ఎగుమతి చేసిన యాపిల్
దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన పరస్పర సుంకాలను తప్పించుకునేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ మార్చి నెలలో తన ఐఫోన్‌లను భారత్ నుంచి పెద్ద ఎత్తున ఎగుమతి చేసింది. కస్టమ్స్ డేటా ప్రకారం, కంపెనీ ప్రధాన సరఫరాదారులుగా ఉన్న ఫాక్స్‌కాన్, టాటా కంపెనీలు సంయుక్తంగా గత నెల ఏకంగా 2 బిలియన్ డాలర్ల(రూ. 17.15 వేల కోట్ల) విలువైన ఐఫోన్‌లను అమెరికాకు కంపెనీ విమానంలో తరలించాయి. ఇది ఇప్పటివరకు ఆల్‌టైమ్ రికార్డు కావడం గమనార్హం. యాపిల్ కంపెనీ భారత మార్కెట్లో తన ఐఫోన్‌ల ఉత్పత్తిని గణనీయంగా పెంచింది. ఇటీవల ట్రంప్ ప్రకటించిన సుంకాల కారణంగా ఖర్చులు పెరుగుతాయనే అంచనాలతో కంపెనీకి అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న సొంత దేశంలో అవసరమైనంత మేర ఇన్వెంటరీని ఉంచాలని భావించింది. దానికోసం అమెరికాకు 600 టన్నుల ఐఫోన్‌లను రవాణా చేసేందుకు చార్టర్డ్ కార్గో విమానాలను యాపిల్ తీసుకుంది. ఈ ప్రక్రియలో కనీసం ఆరు కార్గో జెట్‌లను ఉపయోగించినట్టు సమాచారం. భారత్ కంటే అత్యధికంగా చైనాపై అమెరికా సుంకాలను విధించింది. ఈ పరిణామాలను గమనించిన యాపిల్ ఐఫోన్‌ల ఎగుమతులను పెంచింది. రాయిటర్స్ ప్రకారం, అందుబాటులో ఉన్న కస్టమ్స్ డేటా ఆధారంగా.. యాపిల్ ప్రధాన సరఫరాదారు ఫాక్స్‌కాన్ మార్చిలో 1.31 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్‌లను ఎగుమతి చేసింది. ఇది ఒక నెలలో జరిగిన అత్యధిక ఎగుమతులు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో కలిపి చేసిన దానికి సమానం. ఎగుమతి చేసిన వాటిలో యాపిల్ ఐఫోన్ 13, 14, 16, 16ఈ మోడల్‌లు ఉన్నాయి. దీంతో ఈ ఏడాది భారత్ నుంచి అమెరికాకు ఫాక్స్‌కాన్ మొత్తం రవాణా 5.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మరోక సరఫరాదారు టాటా ఎలక్ట్రానిక్స్ మార్చిలో 612 మిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్‌లను ఎగుమతి చేసింది. ఇది అంతకుముందు నెల కంటే 63 శాతం ఎక్కువ. ఎగుమతి చేసిన వాటిలో ఐఫోన్ 15,16 మోడళ్లు ఉన్నాయి.