Apollo: మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎయిర్ అంబులెన్స్ తీసుకురానున్న అపోలో

by S Gopi |

కంపెనీ అనుబంధ సంస్థ ఆంబర్ వింగ్స్ అభివృద్ధి చేసిన డ్రోన్‌ల ద్వారా రక్తం, అవయవాలు, వ్యాక్సిన్లు, మందులు, ల్యాబ్ నమూనాలను ఆసుపత్రుల మధ్య వేగంగా తరలించే వ్యవస్థను కూడా అమలు చేయనున్నారు.

Apollo: మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎయిర్ అంబులెన్స్ తీసుకురానున్న అపోలో
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో అత్యవసర వైద్య సేవలను మరింత వేగవంతం చేసేందుకు అపోలో హాస్పిటల్స్, చెన్నైకి చెందిన ఈ-ప్లేన్ కంపెనీతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా ఎలక్ట్రిక్ ఎయిర్ అంబులెన్స్‌లు, మెడికల్ డెలివరీ డ్రోన్‌లను దేశ ఆరోగ్య వ్యవస్థలో ఉపయోగించే అవకాశాలను పరిశీలించనున్నారు. ఆసుపత్రుల మధ్య రోగుల బదిలీ, ట్రామా కేసులు, గుండెపోటు, స్ట్రోక్ వంటి అత్యవసర పరిస్థితులు, అలాగే అవయవాల రవాణాలో ఈ-ప్లేన్ అభివృద్ధి చేసిన ఈ200ఎక్స్ ఎలక్ట్రిక్ ఎయిర్ అంబులెన్స్‌ను వాడుతారు. రోడ్డు అంబులెన్స్‌ల కంటే వేగంగా, సంప్రదాయ హెలికాప్టర్ల కంటే తక్కువ ఖర్చుతో సేవలు అందించడమే దీని లక్ష్యం. అదే సమయంలో కంపెనీ అనుబంధ సంస్థ ఆంబర్ వింగ్స్ అభివృద్ధి చేసిన డ్రోన్‌ల ద్వారా రక్తం, అవయవాలు, వ్యాక్సిన్లు, మందులు, ల్యాబ్ నమూనాలను ఆసుపత్రుల మధ్య వేగంగా తరలించే వ్యవస్థను కూడా అమలు చేయనున్నారు.

ఈ ప్రాజెక్టు కోసం అపోలో హాస్పిటల్స్‌కు చెందిన ఆసుపత్రులు, క్లినిక్‌లు, ఫార్మసీలు, డయాగ్నస్టిక్ సెంటర్లు, 1,066కు పైగా అంబులెన్స్‌లతో కూడిన నెట్‌వర్క్‌ను వినియోగించనున్నారు. భవిష్యత్తులో ఈ200ఎక్స్ ఎయిర్ అంబులెన్స్‌లు, మెడికల్ డ్రోన్‌ల కొనుగోలుతో పాటు ఈ-ప్లేన్ కంపెనీలో పెట్టుబడి పెట్టే అవకాశాలను కూడా అపోలో సంస్థ పరిశీలిస్తోంది. అయితే, వాణిజ్య కార్యకలాపాలకు ముందు డీజీసీఏ సహా సంబంధిత నియంత్రణ సంస్థల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. సకాలంలో వైద్యం అందక అనేక ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో, ఈ భాగస్వామ్యం మారుమూల ప్రాంతాలకు కూడా వేగంగా అత్యవసర వైద్య సేవలు అందించగలదని అపోలో ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి చికిత్స ప్రారంభమయ్యే వరకు పట్టే సమయాన్ని గణనీయంగా తగ్గించడం ద్వారా లక్షలాది మంది రోగులకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని ఈ-ప్లేన్ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ సత్య చక్రవర్తి అన్నారు.

Next Story