Anil Ambani: లోన్ ఫ్రాడ్ కేసులో అనిల్ అంబానీపై లుకౌట్ నోటీసులు

by S Gopi |

దీంతో కోర్టు అనుమతి లేకుండా అనిల్ అంబానీ ఇకపై దేశం విడిచి ప్రయాణించడానికి వీలుండదు

Anil Ambani: లోన్ ఫ్రాడ్ కేసులో అనిల్ అంబానీపై లుకౌట్ నోటీసులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి చిక్కులు తప్పేలా లేవు. తాజాగా రూ. 3,000 కోట్ల విలువైన రుణ మోసానికి సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు శుక్రవారం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. దీంతో కోర్టు అనుమతి లేకుండా అనిల్ అంబానీ ఇకపై దేశం విడిచి ప్రయాణించడానికి వీలుండదు. అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను దారి మళ్లించడానికి, ఆర్థిక సంస్థలను తప్పుదారి పట్టించడానికి భాగస్వామ్యం ఉన్నట్టు ఈడీ తన ప్రాథమిక దర్యాప్తులో తేల్చింది. ఇందులో 2017-2019 మధ్య యెస్ బ్యాంక్ నుంచి తీసుకున్న దాదాపు రూ. 3,000 కోట్ల విలువైన రుణాలను అక్రమంగా మళ్లించిన వ్యవహారంలో లుకౌట్ నోటీసులు ఇచ్చింది.

దీనికి ముందు ఈ విషయానికి సంబంధించి ఆగస్టు 5న విచారణకు హాజరవ్వాలని అనిల్ అంబానీకి ఈడీ సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు. గత వారం ముంబైలోని 35 ప్రదేశాలలో అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్‌తో సంబంధం ఉన్న 50 కంపెనీలు, 25 మంది వ్యక్తులపై మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద 35 చోట్ల ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ముఖ్యమైన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలోనే తాజా ఈడీ సమన్లు, లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి.

నకిలీ బ్యాంక్ గ్యారెంటీ

ఈడీ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం.. దర్యాప్తులో అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)కి సమర్పించిన రూ. 68.2 కోట్ల నకిలీ బ్యాంక్ గ్యారెంటీకి మధ్య సంబంధాలు బయటపడ్డాయి. అడాగ్ గ్రూప్‌తో అనుబంధంగా ఉన్న రిలయన్స్ ఎన్‌యూ బీఈఎస్ఎస్ లిమిటెడ్, మహారాష్ట్ర ఎనర్జీ జనరేషన్ లిమిటెడ్ పేర్లతో ఈ బోగస్ గ్యారెంటీ జారీ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ గ్యారెంటీ పూర్తిగా కల్పితమని, ఎస్‌బీఐని మోసం చేసే ఉద్దేశంతో నకిలీ కమ్యూనికేషన్ల ద్వారా ఇచ్చినట్టు ఈడీ కనుగొంది. ముఖ్యంగా, ఈ నకిలీ గ్యారెంటీని నిజమైనదిగా చూపించడానికి సెకీతో కలిసి నకిలీ ఈ-మెయిల్ డొమైన్‌ను ఉపయోగించినట్టు తేలింది. మోసపూరిత ఈ-మెయిల్ వ్యవహారం, డిజిటల్ వివరాలను తెలుసుకోవడానికి ఈడీ నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (ఎన్ఐఎక్స్ఐ) నుంచి డొమైన్ రిజిస్ట్రేషన్ రికార్డులను సేకరించింది.

ఇంకా ఎన్నో ఆరోపణలు

మరోవైపు, 2017-19 మధ్యకాలంలో రిలయన్స్ గ్రూప్ కంపెనీలపై యెస్ బ్యాంకు ఇచ్చిన రూ. 3,000 కోట్ల రుణాలు కూడా చట్టవ్యతిరేకంగా దారి మళ్లించినట్టు అభియోగాలు ఉన్నాయి. యెస్ బ్యాంకు మాజీ ప్రమోటర్లకు లంచం ఇచ్చారనే ఆరోపణలున్నాయి. ఇక, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్న రూ. 10 వేల కోట్ల రుణాలను సైతం దారి మళ్లించడం, ఆర్‌కామ్, కెనరా బ్యాంకు మధ్య రూ. 1,050 కోట్ల రుణ మోసం, రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ ఏటీ-1 బాండ్లలో రూ. 2,850 కోట్ల పెట్టుబడుల విషయంలో క్విడ్ ప్రోకో వ్యవహారం ఇలా అనిల్ అంబానీపై అనేక రకాల బ్యాంకు రుణ మోశాలు ఉన్నాయని ఈడీ చెబుతోంది.

Next Story