Amul: ధరలు తగ్గించిన అమూల్.. రూ. 40 చౌకగా నెయ్యి

by S Gopi |

కేంద్రం సవరించిన జీఎస్టీ రేటు తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలని నిర్ణయించినట్టు అమూల్ తెలిపింది.

Amul: ధరలు తగ్గించిన అమూల్.. రూ. 40 చౌకగా నెయ్యి
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమూల్ బ్రాండ్ పేరుతో పాల ఉత్పత్తులను మార్కెట్ చేసే కోఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (జీసీఎంఎంఎఫ్‌) దాదాపు అన్ని ఉత్పత్తులపై ధరలు తగ్గించినట్టు వెల్లడించింది. నెయ్యి, వెన్న ఐస్ క్రీం, బేకరీ, ఫ్రోజెన్ స్నాక్స్‌తో సహా 700 కంటే ఎక్కువ ఉత్పత్తుల ప్యాక్‌ల రిటైల్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రం సవరించిన జీఎస్టీ రేటు తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలని నిర్ణయించినట్టు అమూల్ తెలిపింది. కంపెనీ అధికారిక వివరాల ప్రకారం, వెన్న(100 గ్రాములు) ఎంఆర్‌పీ రూ.62 నుంచి రూ.58కి తగ్గింది. నెయ్యి లీటరు ధర రూ.40 తక్కువగా రూ.610కి, అముల్ ప్రాసెస్డ్ చీజ్ బ్లాక్ (కిలో) రూ. 30 తగ్గి రూ. 545కు చేరుకుంది. ఫ్రోజెన్ పనీర్ (200 గ్రాములు) ధర రూ. 99 నుంచి రూ.95కి తగ్గించింది. కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వస్తాయి. ఐస్ క్రీం, బేకరీ సహా చీజ్, పనీర్, చాక్లెట్లు, బేకరీ శ్రేణి, ఫ్రోజెన్ డైరీ, బంగాళాదుంప స్నాక్స్, కండెన్స్‌డ్ మిల్క్, వేరుశెనగ స్ప్రెడ్, మాల్ట్ ఆధారిత పానీయాలు మొదలైన అన్ని ఉత్పత్తులపై ధరలు తగ్గించామని కంపెనీ వివరించింది. ధరల తగ్గింపు వల్ల పాల ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుందని, ముఖ్యంగా ఐస్ క్రీం, జున్ను, వెన్న వంటి ఎక్కువ వినియోగం ఉన్న వాటికి డిమాండ్ ఉంటుందని అముల్ భావిస్తోంది. కాగా, గతవారం మదర్ డైరీ కూడా సెప్టెంబర్ 22 నుంచి తన ఉత్పత్తులపై ధరల కోతలను ప్రకటించిన సంగతి తెలిసిందే.

Next Story