Campa Cola: యూఏఈ మార్కెట్లోకి రిలయన్స్ బ్రాండ్ ఎంట్రీ

by S Gopi |

ప్రపంచంలోనే అతిపెద్ద ఎఫ్అండ్‌బీ సోర్సింగ్ ఈవెంట్ అయిన గల్‌ఫుడ్ 30వ ఎడిషన్ ఈవెంట్‌లో దీన్ని లాంచ్ చేసింది.

Campa Cola: యూఏఈ మార్కెట్లోకి రిలయన్స్ బ్రాండ్ ఎంట్రీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అంతర్జాతీయ మార్కెట్‌పై కన్నేసింది. మంగళవారం సంస్థకు చెందిన ఎఫ్ఎంసీజీ విభాగం రిలయన్స్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్(ఆర్‌సీపీఎల్) యూఏఈ మార్కెట్లో తన కూల్‌డ్రింక్ బ్రాండ్ కాంపాను విడుదల చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎఫ్అండ్‌బీ సోర్సింగ్ ఈవెంట్ అయిన గల్‌ఫుడ్ 30వ ఎడిషన్ ఈవెంట్‌లో దీన్ని లాంచ్ చేసింది. దీంతో రిలయన్స్ సంస్థ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో మొదటి అడుగు వేసింది. 2022లో కాంపా కోలాను కొనుగోలు చేసిన రిలయన్స్ సంస్థ 2023లో భారత మార్కెట్లో అధికారికంగా ఉత్పత్తులను విడుదల చేసింది. 50 ఏళ్ల చరిత్ర కలిగిన కాంపా కోలాను ప్యూర్‌ డ్రింక్స్‌ గ్రూపు 1970లో తీసుకొచ్చింది. అప్పట్లో కోకాకోలా మార్కెటింగ్ చేసిన ప్యూర్ డ్రింక్స్ సొంత బ్రాండ్ ఉండాలనే లక్ష్యంతో కాంపా కోలాను ప్రారంభించింది. తర్వాత దీన్ని సాఫ్ట్‌ డ్రింక్స్‌ తయారీ సంస్థ సోస్యో కొనుగోలు చేయగా, ఈ కంపెనీలో ఆర్‌సీపీఎల్ 50 శాతం వాటాను కొనుగోలు చేసింది. రెండేళ్ల క్రితం రీబ్రాండింగ్ చేస్తూ రిలయన్స్ కొత్త రూపంలో తీసుకొచ్చింది. ఇప్పుడు యూఏఈ మార్కెట్లో కూడా విడుదల చేయడంతో కాంపా కోలా అంతర్జాతీయ మార్కెట్లోకి అడుగుపెట్టింది. యూఏఈలో ఆగ్థియా గ్రూప్‌తో భాగస్వామ్యం ద్వారా రిలయన్స్ సంస్థ కాంపా కోలాను విక్రయించనుంది.

Next Story