Amazon: ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లను సందర్శించే అవకాశం కల్పించనున్న అమెజాన్

by S Gopi |

ఈ పబ్లిక్ టూర్ 45-60 నిమిషాల పాటు ఉంటుంది.

Amazon: ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లను సందర్శించే అవకాశం కల్పించనున్న అమెజాన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన వస్తువులు ఆర్డర్ చేసిన దగ్గరి నుంచి ఇంటి వద్దకు ఎలా చేరుతుందో తెలుసుకోవాలని ఎప్పుడైనా అనుకున్నారా? అయితే, ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇలాంటి సదుపాయాన్ని తన కస్టమర్లకు ఇవ్వాలని భావిస్తోంది. దీనికోసం దేశంలోని అమెజాన్ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లను సందర్శించేందుకు పబ్లిక్ టూర్ కార్యక్రమం చేపట్టనున్నట్టు ప్రకటించింది. కస్టమర్లు ఆర్డర్ చేసిన ప్యాకేజీలు ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లలో ఎలా డెలివరీకి సిద్ధమవుతాయో చూసేందుకు వీలు కల్పించనున్నట్టు అమెజాన్ తెలిపింది. ఈ ఏడాది చివరి త్రైమాసికం నుంచి అమెజాన్‌కు చెందిన ఢిల్లీ ఎన్‌సీఆర్, బెంగళూరులలో ఉన్న ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లను ఉచితంగా వెళ్లి ప్యాకేజీల వెనుక లాజిస్టిక్ పనులను పరిశీలించవచ్చు. ఈ పబ్లిక్ టూర్ 45-60 నిమిషాల పాటు ఉంటుంది. సందర్శించాలనుకునే వినియోగదారులు ప్యాకేజీ డెలివరీకి సిద్ధమయ్యే ప్రక్రియలో లక్షలాది ఉత్పత్తులను నిల్వ చేయడం, కస్టమర్ల ఆర్డర్ ప్రతిరోజూ ప్రాసెస్ కావడం, రవాణాకు సిద్ధమయ్యే అన్ని పనులను దగ్గరగా చూడవచ్చు.

వారంలో మూడు రోజులు

ఈ నిర్ణయం వల్ల ఆసక్తి కలిగిన కస్టమర్లు నేరుగా అమెజాన్ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లను చూడవచ్చు. టెక్నాలజీ వినియోగం, కస్టమర్ డెలివరీల వెనుక పనిచేసే వ్యక్తులను కలిసి మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి అనుమతిచ్చిన ఢిల్లీ ఎన్‌సీఆర్, బెంగళూరు సెంటర్లలో పబ్లిక్ టూర్‌లు వారానికి మూడుసార్లు జరుగుతాయి. ఒక్కో పబ్లిక్ టూర్‌కు 20 మంది వరకు పాల్గొనవచ్చు. దీనికి ఆసక్తి చూపే వ్యక్తులు ఈ ఏడాది చివరి నుంచి ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. కాగా, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఉన్న అమెజాన్ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ 4.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇది ఎనిమిది ఫుట్‌బాల్ మైదానాలకు సమానం. బెంగళూరులోని సెంటర్ 20 లక్షల క్యూబిక్ అడుగులతో దేశంలోనే అతిపెద్దది.

Next Story