- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Aviation Industry: దేశీయ విమానయాన రంగంలోకి కొత్తగా మూడు సంస్థలు
అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్‌ప్రెస్ సంస్థలు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి నిరభ్యంతర ధృవీకరణ పత్రాలను(ఎన్ఓసీ) పొందాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ విమానయాన రంగంలోకి కొత్త సంస్థలు అడుగుపెట్టనున్నాయి. బుధవారం పౌరవిమానయాన శాఖ రెండు కొత్త విమానయాన సంస్థలకు విమానాలు నడిపేందుకు అనుమతి ఇచ్చింది. ఇటీవల ఇండిగో సంస్థ కారణంగా ఏర్పడిన అంతరాయం నేపథ్యంలో కొన్ని విమానయాన సంస్థలైపైనే ఆధారపడటాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. తాజాగా అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్‌ప్రెస్ సంస్థలు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి నిరభ్యంతర ధృవీకరణ పత్రాలను(ఎన్ఓసీ) పొందాయి. దేశీయ విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో ఈ ఆమోదాలు రావడంతో రానున్న రోజుల్లో పోటీ మరింత తీవ్రం కానుంది. ఈ రెండింటితో పాటు ఉత్తరప్రదేశ్‌లోని మరో విమానయాన సంస్థ శంఖ్ ఎయిర్ ఇప్పటికే తన ఎన్ఓసీని పొందింది. ఈ సంస్థ 2026లో కమర్షియల్ విమాన సర్వీసులను ప్రారంభించే అవకాశం ఉంది.
అవకాశాలు..సవాళ్లు
ప్రయాణీకుల డిమాండ్ పెరుగుతున్నప్పటికీ, అధిక ఖర్చులు, అప్పులు, నిర్వహణ సవాళ్ల కారణంగా కొత్త విమానయాన సంస్థలు గతంలో మనుగడ సాగించడం కష్టమని భావించాయి. ప్రస్తుతం దేశంలో తొమ్మిది షెడ్యూల్ దేశీయ విమానయాన సంస్థలు మాత్రమే పనిచేస్తున్నాయి. ప్రాంతీయ క్యారియర్ ఫ్లై బిగ్ షెడ్యూల్ చేసిన సేవలను ఆపివేసిన తర్వాత అక్టోబర్‌లో ఈ సంఖ్య మరింత తగ్గింది. ముఖ్యంగా ప్రయాణీకుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతున్న సమయంలో ఈ రంగం తక్కువ అందుబాటులో ఉండటంపై ఆందోళనను పెంచింది. మార్కెట్‌లో ఎక్కువగా ఇండిగో, ఎయిర్ ఇండియా గ్రూప్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఇందులో ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి. ఈ విమానయాన సంస్థలు కలిసి దేశీయ విమాన ప్రయాణాలలో 90 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి. ఇండిగో మాత్రమే మార్కెట్‌లో 65 శాతం కంటే ఎక్కువ వాటాతో కొనసాగుతోంది.
ఈ నెల ప్రారంభంలో ఇండిగోలో నెలకొన్న తీవ్ర సంక్షోభం దేశవ్యాప్తంగా ప్రయాణికులను ప్రభావితం చేశాయి. అతిపెద్ద పెద్ద దేశంగా, విస్తరిస్తున్న మార్కెట్‌లో ఒకే విమానయాన సంస్థపై ఎక్కువగా ఆధారపడటం వల్ల కలిగే నష్టాలను ఈ సంఘటన ముందుకు తెచ్చింది.
కొత్త సంస్థల గురించి..
ప్రయాణ, సంబంధిత సేవలలో ఇప్పటికే ఉనికిని కలిగిన కేరళకు చెందిన అల్ హింద్ గ్రూప్ అల్ హింద్ ఎయిర్‌ను ప్రమోట్ చేస్తోంది. ఇక, విమాన ప్రయాణానికి డిమాండ్ బలంగా ఉన్నప్పటికీ పోటీ పరిమితంగా ఉన్న సమయంలో దేశీయ మార్కెట్‌లోకి ప్రవేశించాలని లక్ష్యంగా పెట్టుకున్న మరొక విమానయాన సంస్థ ఫ్లైఎక్స్‌ప్రెస్. ఇప్పటికే ఎన్ఓసీ తీసుకున్న శంఖ్ ఎయిర్ మరొక సంస్థ. కమర్షియల్‌గా విమాన సేవలను ప్రారంభించడానికి ముందు ఈ మూడు విమానయాన సంస్థలు ఇంకా అనేక నియంత్రణ దశలను పూర్తి చేయాల్సి ఉంటుంది. శంఖ్ ఎయిర్ కు ఇప్పటికే అనుమతి లభించగా, ఈ వారంలో అల్ హింద్ ఎయిర్ మరియు ఫ్లైఎక్స్‌ప్రెస్‌లకు ఎన్ఓసీలు తీసుకోనున్నాయి.






