Airtel: మరోసారి టారిఫ్ పెంపు సంకేతాలిచ్చిన ఎయిర్‌టెల్

by S Gopi |
Airtel: మరోసారి టారిఫ్ పెంపు సంకేతాలిచ్చిన ఎయిర్‌టెల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ప్రైవేట్ రంగ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ త్వరలో టారిఫ్ ధరలను పెంచనుంది. ఈ మేరకు త్రైమాసిక ఫలితాల సందర్భంగా కంపెనీ సంకేతాలిచ్చింది. టెలికాం రంగంలో పెట్టుబడులకు అవకాశాలు పెరుగుతుండటం, దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని పరిశ్రమలో టారిఫ్ పెంపు అవసరం ఉందని కంపెనీ భావిస్తోంది.మూడో త్రైమాసిక ఫలితాలతో పాటు విడుదల చేసిన ఓ ప్రకటనలో.. టెలికాం రంగంలో పెరుగుతున్న వృద్ధీ కొనసాగించేందుకు, భవిష్యత్తులో మౌలిక సదుపాయాల పెట్టుబడుల కోసం టారిఫ్ పెంపు ముఖ్యమని ఎయిర్‌టెల్ వైస్-ఛైర్మన్, ఎండీ గోపాల్ విట్టల్ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి టెలికాం రంగంలో సవాళ్లు ఉన్నప్పటికీ మూలధన నిధుల కేటాయింపుల ద్వారా ఆర్థిక పరిస్థితిని పటిష్టంగా కొనసాగిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ సాధ్యమైనంత మేర అప్పులను తగ్గించినట్టు పేర్కొంది. ఇక, డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి భారతీ ఎయిర్‌టెల్ భారీ లాభాలను వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఏకంగా రూ. 14,781.2 కోట్లతో 505 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 2,442 కోట్ల లాభాలను నమోదు చేసింది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ లాభం రూ.3,593 కోట్ల నుంచి 311 శాతం పెరిగింది. గతేడాది కంపెనీ టారిఫ్ పెంపు నిర్ణయాన్ని తీసుకుంది. తద్వారా కంపెనీ ఒక్కో వినియోగదారు నుంచి ఆదాయాన్ని(ఆర్పు) పెంచుకోవడం ద్వారా అధిక లాభాలను సాధించింది. కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపిన వివరాల ప్రకారం, 2024 డిసెంబర్ 31 నాటికి ఎయిర్‌టెల్ గణనీయంగా మెరుగుపడింది.

Next Story

Most Viewed