Airtel: కాల్స్, మెసేజ్‌ల కోసమే ప్రీపెయిడ్ ప్లాన్‌లు తీసుకొచ్చిన ఎయిర్‌టెల్

by S Gopi |

ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్‌లకు బదులుగా ఇప్పటికే ఉన్న రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లలో మార్పులు చేసిన అందుబాటులోకి తీసుకొచ్చింది.

Airtel: కాల్స్, మెసేజ్‌ల కోసమే ప్రీపెయిడ్ ప్లాన్‌లు తీసుకొచ్చిన ఎయిర్‌టెల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ డేటా లేకుండా కేవలం కాల్స్, మెసేజ్‌లతో కూడిన రెండు ప్లాన్‌లను తీసుకొచ్చింది. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఇటీవల జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఎయిర్‌టెల్ ఈ నిర్ణయం తీసుకుంది. కాల్స్, మెసేజ్‌ల కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌లు తీసుకురావాలని టెలికాం కంపెనీలకు ట్రాయ్‌ సూచించింది. అయితే, ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్‌లకు బదులుగా ఇప్పటికే ఉన్న రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లలో మార్పులు చేసిన అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో రూ. 509 ప్రీపెయిడ్ ప్లాన్ ఒకటి. ఈ ప్లాన్‌లో భాగంగా 84 రోజుల కాలవ్యవధితో అన్‌లిమిటెడ్ కాల్స్, 900 ఎస్ఎంఎస్‌లు వస్తాయి. ఇదివరకు ఈ ప్లాన్‌లో డేటా ప్రయోజనాలు కూడా ఉండేవి. దాన్ని తొలగించి కాల్స్, ఎస్ఎంఎస్‌లకు మాత్రమే ఎయిర్‌టెల్ పరిమితం చేసింది. ఈ ప్లాన్‌లో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్, అపోలో 24/7 సర్కిల్ మెంబర్‌షిప్, ఉచిత హలో ట్యూన్స్‌ వంటి అదనపు ప్రయోజనాలున్నాయి. ఇక, వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 1,999లో కూడా ఎయిర్‌టెల్ మార్పులు చేసింది. ఇందులోనూ డేటా ప్రయోజనాలను తొలగించి అన్‌లిమిటెడ్ కాల్స్, 3,600 ఎస్ఎంఎస్‌లు ఇస్తోంది. ఇతర ప్రయోజనాలు కూడా కొనసాగుతాయి. ప్రస్తుతం దాదాపు అన్ని టెలికాం కంపెనీలు కాల్స్, మెసేజ్‌లతో పాటు తప్పనిసరిగా డేటాతో కూడిన ప్లాన్‌లను మాత్రమే ఇస్తున్నాయి. దీనివల్ల కొంతమంది సబ్‌స్క్రైబర్లకు ఇంటర్నెట్ అవసరం లేకపోయినా రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తోంది. ఈ సమస్య పరిష్కారానికే ట్రాయ్ కాల్స్, ఎస్ఎంఎస్‌లతో కూడా ప్రత్యేక ప్లాన్‌లను ప్రవేశపెట్టాలని ఆదేశించింది.

Next Story