- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Air India: ఎనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత మొదటి లైన్ ఫిట్ డ్రీమ్‌లైనర్ అందుకున్న ఎయిర్ఇండియా
ప్రైవేటీకరణ తర్వాత ఎయిర్ ఇండియా నేరుగా బోయింగ్ నుంచి అందుకున్న మొదటి వైడ్-బాడీ విమానం ఇదే.

దిశ, బిజినెస్ బ్యూరో: టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా ఎనిమిది ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తన మొట్టమొదటి కొత్త 'లైన్ ఫిట్' బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ విమానాన్ని అందుకుంది. ఈ పేరులో లైన్ ఫిట్ అంటే ఎయిర్ ఇండియా స్వంత డిజైన్, అవసరాలకు అనుగుణంగా ప్రారంభం నుంచి నిర్మించారని అర్థం. ఎయిర్ ఇండియా చివరిసారిగా 2017, అక్టోబర్‌లో (ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నప్పుడు) కొత్త డ్రీమ్‌లైనర్ విమానాన్ని పొందింది. ప్రైవేటీకరణ తర్వాత ఎయిర్ ఇండియా నేరుగా బోయింగ్ నుంచి అందుకున్న మొదటి వైడ్-బాడీ విమానం ఇదే. అమెరికాలోని సియాటెల్‌లో ఉన్న బోయింగ్ ఎవరెట్ ఫ్యాక్టరీలో ఈ విమాన యాజమాన్య బదిలీ పూర్తయిందని కంపెనీ అధికారి గురువారం ప్రకటనలో వెల్లడించారు. దీంతో ఎనిమిదేళ్లలోనే ఎయిర్ఇండియా సంస్థ విమానాల జాబితాలో చేరిన మొదటి డ్రీమ్‌లైనర్ కూడా ఇదే. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తనిఖీల తర్వాత, ఈ విమానం మరి కొద్దిరోజుల్లో భారత్‌కు చేరుకుంటుందని భావిస్తున్నారు. ఈ కొత్త విమానంలో ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్ క్లాస్‌లతో కూడిన మూడు తరగతుల సీటింగ్ సౌకర్యం ఉంది.
ఈ విమానం 2023లో ఎయిర్ ఇండియా చేసిన 220 విమానాల భారీ ఆర్డర్లలో మొదటి వైడ్-బాడీ జెట్, మొత్తం మీద 52వ విమానం. ఇప్పటివరకు, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 51 బోయింగ్ 737-8 నారో-బాడీ విమానాలను డెలివరీ అందుకుంది. విలీనం తర్వాత విస్తారా నుంచి వారసత్వంగా వచ్చిన విమానాలతో సహా గత ఆర్డర్‌ల నుంచి ఎయిర్ఇండియా ఇప్పటికే డ్రీమ్‌లైనర్ విమానాలను నడుపుతోంది. మొత్తంగా, ఎయిర్ ఇండియా గ్రూప్ ఇప్పుడు 300 కంటే ఎక్కువ విమానాలను కలిగి ఉంది. పూర్తిగా రిఫ్రెష్ చేసిన ఇంటీరియర్‌లతో దాదాపు డజను పాత డ్రీమ్‌లైనర్‌లు 2026 నాటికి తిరిగి అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.






