Air India: ఫ్లైట్ టికెట్‌తో పాటే హోటల్ బస

by S Gopi |

ఈ ఒప్పందంతో ఎయిర్ ఇండియా వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లోనే విమాన టిక్కెట్లతో పాటు హోటళ్లు, హోమ్‌స్టేలు, విల్లాలు, అపార్ట్‌మెంట్‌లు వంటి వసతి సదుపాయాలను కూడా బుక్ చేసుకునే అవకాశం లభిస్తుంది.

Air India: ఫ్లైట్ టికెట్‌తో పాటే హోటల్ బస
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో వేగంగా పెరుగుతున్న డిజిటల్ ట్రావెల్ మార్కెట్‌లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రముఖ ఆన్‌లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫారమ్ బుకింగ్ .కామ్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ ఒప్పందంతో ఎయిర్ ఇండియా వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లోనే విమాన టిక్కెట్లతో పాటు హోటళ్లు, హోమ్‌స్టేలు, విల్లాలు, అపార్ట్‌మెంట్‌లు వంటి వసతి సదుపాయాలను కూడా బుక్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 45 భాషల్లో అందుబాటులో ఉన్న 3.1 కోట్లకు పైగా వసతి ఆప్షన్లు ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఉంటాయి. దీంతో ప్రయాణికులు ఫ్లైట్, హోటల్ బుకింగ్‌ల కోసం వేర్వేరు యాప్‌లు లేదా వెబ్‌సైట్‌లను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా మొత్తం ట్రిప్‌ను ఒకే చోట ప్లాన్ చేసుకోవచ్చు. బుకింగ్ .కామ్ అందించే 24 గంటల కస్టమర్ సపోర్ట్ కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఈ భాగస్వామ్యంలో మరో కీలక అంశం మహారాజా క్లబ్ సభ్యులకు లభించే అదనపు ప్రయోజనాలు. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా చేసే హోటల్ బుకింగ్‌లపై ప్రతి రూ.100 ఖర్చుకు ఐదు మహారాజా పాయింట్లు లభిస్తాయి. వీటిని అవార్డ్ టిక్కెట్లు, క్యాబిన్ అప్‌గ్రేడ్‌లు వంటి సేవలకు వినియోగించుకోవచ్చు. అలాగే ఈ కొత్త సేవల ప్రారంభం నేపథ్యంలో జూన్ 22 నుంచి జూలై 21 వరకు ఎంపిక చేసిన ప్రాపర్టీలపై 15 శాతం వరకు ప్రత్యేక డిస్కౌంట్లు కూడా ఉంటాయని కంపెనీ వెల్లడించింది.

Next Story