ఇకపై డీజిల్ బస్సులు కొనుగోలు చేయం : మంత్రి మండిపల్లి

by Naga Rani Yarlagadda |

సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం ద్వారా రాష్ట్రంలో మహిళలు లబ్ధి పొందుతున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

ఇకపై డీజిల్ బస్సులు కొనుగోలు చేయం : మంత్రి మండిపల్లి
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం ద్వారా రాష్ట్రంలో మహిళలు లబ్ధి పొందుతున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఉచిత బస్సు పథకం కింద ఆర్టీసీ చెల్లించాల్సిన సొమ్మును సకాలంలో చెల్లిస్తూ.. సంస్థపై భారం లేకుండా చూస్తున్నామన్నారు. ఈ పథకం అమలుకు సహకరిస్తున్న ఆర్టీసీకి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకానికి ప్రభుత్వం రోజుకు రూ.8.5 కోట్లు ఖర్చు చేస్తోందని వెల్లడించారు. మహిళల కోసం తీసుకొచ్చిన ఉచితబస్సు పథకాన్ని తాము ఏనాడూ భారంగా చూడలేదని, బాధ్యతగా మాత్రమే చూశామన్నారు. దివ్యాంగశక్తిని ఇప్పటి వరకూ 38.00 లక్షల మంది వినియోగించుకున్నారని, స్త్రీ శక్తి, దివ్యాంగశక్తి వచ్చాక బస్సులో OR శాతం 90 దాటిందన్నారు.

కాగా.. ఇకపై ఆర్టీసీ కోసం డీజిల్ బస్సుల్ని కొనుగోలు చేయమని మంత్రి మండిపల్లి స్పష్టం చేశారు. 2031 నాటికి రాష్ట్రంలోని అన్ని డిపోల్లోనూ ఎలక్ట్రిక్, CNG బస్సులే ఉంటాయని, 8321 ఎలక్ట్రిక్, 500 సీఎన్జీ బస్సులు కొనేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయన్నారు. టూరిస్ట్ బస్సుల రిజిస్ట్రేషన్ పన్ను తగ్గింపును కేబినెట్ ఆమోదానికి పెట్టామని చెప్పారు. ఇక ఆర్టీసీలో గత ప్రభుత్వం కారుణ్య నియామకాలు చేపట్టలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక 1780 కారుణ్య నియామకాలు చేపట్టామన్నారు. లాజిస్టిక్స్ ద్వారా ఆర్టీసీ ఆదాయం రూ.227 కోట్లకు చేరిందని మంత్రి తెలిపారు.

Next Story