- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్యాన్సర్ నియంత్రణకు సమగ్ర కార్యాచరణ : మంత్రి దామోదర రాజనర్సింహ
క్యాన్సర్ నియంత్రణలో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, వైద్య నిపుణులు సమిష్టిగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపునిచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో: క్యాన్సర్ నియంత్రణలో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, వైద్య నిపుణులు సమిష్టిగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో జరిగిన బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాతికేళ్లుగా క్యాన్సర్ బాధితులకు నాణ్యమైన, అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న బసవతారకం హాస్పిటల్ యాజమాన్యం, వైద్యులు, సిబ్బంది, దాతలను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. దివంగత సీఎం ఎన్టీఆర్ దూరదృష్టికి ఈ ఆస్పత్రి ఒక సజీవ ప్రతీకగా నిలిచిందన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను అదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తూ, సంస్థను మరింత ఉన్నత స్థాయికి నడిపిస్తున్న హాస్పిటల్ చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ సేవలను మంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఏటా 55 వేల కొత్త కేసులు..
ప్రస్తుత కాలంలో ప్రజారోగ్యానికి క్యాన్సర్ ఒక పెద్ద సవాలుగా మారిందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పర్యావరణ కాలుష్యం, జన్యుపరమైన కారణాల వల్ల క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని పేర్కొన్నారు. ఒక్క తెలంగాణలోనే ఏటా కొత్తగా 50 వేల నుంచి 55 వేల వరకు క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని ఆయన వెల్లడించారు. ఒకరు క్యాన్సర్ బారిన పడితే ఆ రోగితో పాటు వారి కుటుంబం మొత్తం మానసిక, సామాజిక, ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భయంకర మహమ్మారిపై పోరాడేందుకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను అమలు చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో క్యాన్సర్ ప్రివెన్షన్, వ్యాధిని తొలి దశలోనే గుర్తించడం, ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. క్యాన్సర్‌ను నోటిఫైబుల్ డిసీజ్ గా ప్రకటించామని, స్టేట్ క్యాన్సర్ రిజిస్ట్రీ, క్యాన్సర్ పోర్టల్ ను ఏర్పాటు చేసి ప్రతి కేసు నమోదు చేసే వ్యవస్థను తీసుకొచ్చామని చెప్పారు. క్యాన్సర్ మహమ్మారి కారణంగా ఏ ఒక్క కుటుంబం కూడా రోడ్డున పడకూడదన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఓ వైపు ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఉచిత వైద్య సదుపాయాలను మెరుగుపరుస్తూనే.. మరోవైపు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా బసవతారకంతో పాటు ఇతర ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్స్‌లోనూ క్యాన్సర్ పేషెంట్లకు ఉచితంగా నాణ్యమైన చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. క్యాన్సర్‌పై ప్రభుత్వం చేస్తోన్న ఈ పోరాటంలో డాక్టర్లు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలని, అందరం కలిసికట్టుగా పనిచేసి ప్రజలను కాపాడుకుందామని మంత్రి పిలుపునిచ్చారు.






