- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Air India: కొత్త సీఈఓ కోసం ఎయిర్ ఇండియా వెతుకులాట
సంస్థను వృద్ధి పథంలోకి నడిపించడంతో పాటు ఆశించిన స్థాయిలో పనితీరు ఉండాలని చంద్రశేఖరన్ ఆశిస్తున్నారు

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ఇండియా కొత్త సీఈఓ కోసం వేట మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుత సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్‌పై ఉన్న అసంతృప్తే ఇందుకు కారణమని పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. త్వరలో క్యాంప్‌బెల్ విల్సన్‌ను సాగనంపి, ఆయన స్థానంలో మరొకరిని సీఈఓగా తీసుకురావాలని ఎయిర్ఇండియా మాతృసంస్థ టాటా సన్స్ భావిస్తోంది. ఇప్పటికే పలు విమానయాన సంస్థల కీలక అధికారులతో టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సంప్రదించినట్టు సమాచారం. సంస్థను వృద్ధి పథంలోకి నడిపించడంతో పాటు ఆశించిన స్థాయిలో పనితీరు ఉండాలని చంద్రశేఖరన్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం సంస్థ పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు. అందుకే విల్సన్ స్థానంలో మరో కొత్త వ్యక్తిని తీసుకోవడంపై వేగంగా చర్చలు జరుగుతున్నాయి. ఎయిర్ఇండియాతో పాటు ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్ సీఈఓ మార్పుపైనా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుత సీఈఓ స్థానంలో అలోక్ సింగ్‌ను ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్ సీఈఓగా తీసుకోవాలనే చర్చ జరుగుతోంది. కాగా, ఎయిర్ఇండియా సీఈఓ విల్సన్ పదవీ కాలం 2027, జూన్ నాటికి ముగియనుంది.
నేపథ్యం
2022, జూలైలో ఎయిర్ఇండియా సీఈఓగా వచ్చిన క్యాంప్‌బెల్ విల్సన్, సంస్థను గ్లోబల్ స్థాయిలో పోటీగా నిలబెట్టడం, ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేలా చేసే లక్ష్యంతో బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాతే విస్తారాను ఎయిర్ఇండియాలో విలీనం చేశారు. కొత్తగా ప్రధాన రూట్లలో ఎక్కువ విమానాలను నడిపింది. ఈ నేపథ్యంలో సంస్థలో క్రమంగా సరఫరా సమస్యల వల్ల కొత్త విమానాలను తీసుకురావడంలో ఆలస్యమైంది. అనంతరం గతేడాది జూన్‌లో జరిగిన అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం సంస్థపై మరింత సమీక్షకు దారితీసింది. అత్యవసర పరికరాల తనిఖీలు లేకుండా విమానాలు నడపడం, ఇంజిన్ భాగాలను మార్చడంలో జాప్యం, ఫోర్జరీ, సిబ్బంది విషయంలో నిర్వహణ లోపాలు వంటి సమస్యలు సంస్థను చుట్టుముట్టాయి. సంస్థ ఉన్నతాధికారుకు నియంత్రణ సంస్థ డీజీసీఏ నోటీసులు కూడా జారీ చేసింది. దీంతో సంస్థ సీఈఓ మార్పుపై వేగంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి సంస్థ ప్రస్తుతానికి అధికారికంగా స్పందించాల్సి ఉంది.






