Air india: సీనియర్ సిటిజన్లకు ఎయిర్ ఇండియా భారీ ఆఫర్

by S Gopi |

సీనియర్ సిటిజన్లు ప్రత్యేక రాయితీలు, అదనపు లగేజీ, సులభంగా బుకింగ్ చేసుకునే ఆప్షన్లు పొందవచ్చు.

Air india: సీనియర్ సిటిజన్లకు ఎయిర్ ఇండియా భారీ ఆఫర్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ఇండియా సీనియర్ సిటిజన్లకు భారీ ఆఫర్ ప్రకటించింది. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న ప్రయాణికులకు ఇది వర్తిస్తుందని, దీని ద్వారా వారు విమాన ప్రయాణాన్ని మరింత సరసమైన ధరలో, సౌకర్యవంతంగా ఆస్వాదించవచ్చని కంపెనీ తెలిపింది. సీనియర్ సిటిజన్లు ఇప్పుడు దేశీయ, అంతర్జాతీయ విమానాలలో ప్రత్యేక రాయితీలు, అదనపు లగేజీ, సులభంగా బుకింగ్ చేసుకునే ఆప్షన్లు పొందవచ్చు. సీనియర్ సిటిజన్లు ఎయిర్ఇండియా వెబ్‌సైట్, మొబైల్ యాప్, విమానాశ్రయ కౌంటర్లు లేదా ఎక్కడైన టికెట్ బుకింగ్ సమయంలో 'కన్సెషన్ టైప్' ట్యాబ్ కింద 'సీనియర్ సిటిజన్' ఎంపికను ఎంచుకోవడం ద్వారా డిస్కౌంట్ పొందవచ్చు. బుకింగ్, చెక్-ఇన్ సమయంలో పుట్టిన తేదీతో చెల్లుబాటు అయ్యే ప్రభుత్వం జారీ చేసిన ఫోటో ఐడీ చూపించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఎయిర్ఇండియా తన అన్ని దేశీయ, అంతర్జాతీయ విమానాలలో ఈ ఆఫర్ అందితోంది. అయితే, ఇది భాగస్వామ్య ఎయిర్‌లైన్స్ నిర్వహించే కోడ్‌షేర్ విమానాలకు వర్తించదు. అలాగే, డిస్కౌంట్లు సీట్ల లభ్యత, ప్రతి క్యాబిన్ తరగతి ఛార్జీ నియమాలకు లోబడి ఉంటాయి.

ఎయిర్ఇండియా వెల్లడిచిన వివరాల ప్రకారం, అంతర్జాతీయ రూట్లలో టికెట్ బేస్ ధరపై 10 శాతం రాయితీ ఇస్తోంది. ఎకానమీ, ఫస్ట్‌క్లాస్ వరకు అన్ని కేబిన్లకు ఇది అమలవుతుంది. ఒకసారి ప్రయాణ తేదీని మార్చుకోవచ్చు. ఆ సమయానికి ఛార్జీల్లో వ్యత్యాసం ఉంటే చెల్లించక తప్పదు. లగేజీకి సంబంధించి ఒక ప్రయాణికుడు అదనంగా 10 కిలోలు తీసుకెళ్లవచ్చు. ఎకానమీ, ప్రీమియం ఎకానమీ క్లాస్ ప్రయాణికులు 23 కిలోలు ఉండే రెండు లగేజీలను, బిజినెస్ క్లాస్ ప్రయాణికులు 32 కిలోల రెండు లగేజీలను తీసుకెళ్లే వీలుంటుంది. ఇక, దేశీయ రూట్లలో వెళ్లే వారు టికెట్ బేస్ ధరలో 25 శాతం డిస్కౌంట్ పొందుతారు. ఒకసారి తేదీ మార్చుకునే అవకాశం ఉండగా, అదనంగా 15 కిలోలు తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది.

Next Story