Hiring Trend: హైరింగ్‌లో కొత్త ట్రెండ్

by S Gopi |

ఏఐ స్కిల్స్, ప్రత్యేక పరిజ్ఞానం, వేగంగా పని చేసే సామర్థ్యం ఉన్న అభ్యర్థులకే డిమాండ్ పెరుగుతోంది.

Hiring Trend: హైరింగ్‌లో కొత్త ట్రెండ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో జాబ్ మార్కెట్ కొత్త దశలోకి అడుగుపెడుతోంది. గతంలో మాదిరి ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకోవడం కంటే, ఇప్పుడు సరైన స్కిల్స్ ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయడంపైనే కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. అప్‌గ్రాడ్ రిక్రూట్‌మెంట్ విడుదల చేసిన ‘ఇండియా ఎట్ వర్క్: హైరింగ్ ట్రెండ్స్’ నివేదిక ప్రకారం, ఏఐ స్కిల్స్, ప్రత్యేక పరిజ్ఞానం, వేగంగా పని చేసే సామర్థ్యం ఉన్న అభ్యర్థులకే డిమాండ్ పెరుగుతోంది. 12 రంగాలకు చెందిన 11,418 మంది హెచ్‌ఆర్, టాలెంట్, బిజినెస్ లీడర్ల అభిప్రాయాల ఆధారంగా రూపొందించిన ఈ నివేదిక ప్రకారం, కంపెనీలు ఇప్పుడు ఉద్యోగుల సంఖ్య కంటే టాలెంట్ నాణ్యతకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. అందుకే దాదాపు 10 కంపెనీల్లో 8 సంస్థలు తమ హైరింగ్ లక్ష్యాలను పూర్తిగా చేరుకోలేకపోయాయి. కారణం అభ్యర్థుల కొరత కాదు.. సరైన స్కిల్స్ ఉన్న వారిని గుర్తించడం, వేగంగా ఎంపిక చేయడంలో ఎదురవుతున్న సవాళ్లేనని నివేదిక స్పష్టం చేసింది. వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, మెరుగైన టాలెంట్ పైప్‌లైన్, క్రమబద్ధమైన ఎంపిక ప్రక్రియ ఉన్న సంస్థలే తమ నియామక లక్ష్యాలను విజయవంతంగా చేరుకున్నాయి.

మరోవైపు, 3 నుంచి 8 ఏళ్ల అనుభవం ఉన్న ప్రొఫెషనల్స్‌కు ప్రస్తుతం అత్యధిక డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఐటీ సర్వీసులు, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (జీసీసీ)లో పునర్‌వ్యవస్థీకరణ జరుగుతుండటంతో అనుభవజ్ఞులైన టెక్ ప్రొఫెషనల్స్‌కు అవకాశాలు పెరుగుతున్నాయి. ఏఐ ఆధారిత బిజినెస్ మోడళ్ల వైపు సంస్థలు వేగంగా అడుగులు వేస్తుండటంతో ఏఐ లిటరసీ కూడా కీలక నియామక ప్రమాణంగా మారుతోంది. అయినప్పటికీ ప్రస్తుతం కేవలం 8 శాతం కంపెనీలు మాత్రమే ఏఐ స్కిల్స్‌ను తప్పనిసరి అర్హతగా పరిగణిస్తున్నాయి. నివేదిక ప్రకారం 70 శాతం కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నియామకాలు కొనసాగిస్తామని చెబుతున్నప్పటికీ, కీలక పోస్టులను భర్తీ చేయడానికి 12 నుంచి 20 వారాల వరకు సమయం పడుతోంది. వేతనాల విషయంలో ఎక్కువ సంస్థలు తక్కువ పెంపునే ప్రణాళికలో ఉంచగా, వ్యాపారానికి కీలకమైన పోస్టుల కోసం మాత్రం ప్రత్యేకంగా అధిక వేతనాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి.

Next Story