Youtube: ఏఐ-ఎఫెక్ట్.. 'వాలెంటరీ ఎగ్జిట్ ప్రోగ్రామ్' ప్రకటించిన యూట్యూబ్

by S Gopi |

ఏఐ వినియోగం పెరుగుతున్న కారణంగా సంస్థలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ అన్నారు

Youtube: ఏఐ-ఎఫెక్ట్.. వాలెంటరీ ఎగ్జిట్ ప్రోగ్రామ్ ప్రకటించిన యూట్యూబ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: టెక్ రంగంలో మరోసారి తొలగింపులు మొదలైన సంగతి తెలిసిందే. ఇటీవలే అమెజాన్ 14 వేల మందిని ఇంటికి సాగనంపుతూ నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగం పెరగడమే కారణం. ఇలాంటి సమయంలో ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ కీలక ప్రకటన చేసింది. అమెరికాలోని కొందరు ఉద్యోగులను 'వాలెంటరీ ఎగ్జిట్ ప్రోగ్రామ్' కింద ప్యాకేజీని ఇవ్వనున్నట్టు తెలిపింది. ఏఐ వినియోగం పెరుగుతున్న కారణంగా సంస్థలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యూట్యూబ్ భావిస్తున్నట్టు కంపెనీ సీఈఓ నీల్ మోహన్ అన్నారు. ఉద్యోగులకు పంపిన మెమోలో యూట్యూబ్ చీఫ్ నీల్ మోహన్.. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 'వాలెంటరీ ఎగ్జిట్ ప్రోగ్రామ్'ను వివిధ ప్రయోజనాల ప్యాకేజీతో అందిస్తామన్నారు. గూగుల్ లాగానే యూట్యూబ్ తదుపరి లక్ష్యం ఏఐ అని మోహన్ స్పష్టం చేశారు. ఆ క్రమంలో అభివృద్ధి చెందుతున్న రంగాలపై దృష్టి సారించి, పెట్టుబడులు పెట్టనున్నట్టు వెల్లడించారు. ఈ నిర్ణయంతో గత పదేళ్లలోనే తొలిసారి యూట్యూబ్ ప్రొడక్ట్ డివిజన్‌ను పునర్నిర్మిస్తామన్నారు. అందుకే ఈ నిర్ణయమని చెప్పారు. అయితే, ఏ ఉద్యోగినీ బలవంతంగా తొలగించాలనే ఆలోచన సంస్థకు లేదని, కంటెంట్ క్రియేషన్, యూజర్ ఎక్స్‌పీరియన్స్‌లో ఏఐ అవసరాన్ని గుర్తించి వాలెంటరీ ఎగ్జిట్ ప్రోగ్రామ్ రూపొందించినట్టు వివరించారు. యూట్యూబ్‌లోని అన్ని విభాగాలను ప్రభావితం చేసే సామర్థ్యం ఏఐకు ఉందని తెలుస్తోంది. దీన్ని అధిగమించేలా సంస్థ ప్రణాళికలు ఉండాలని నీల్ మోహన్ పేర్కొన్నారు.

Next Story