Infosys: ఏఐ ఉద్యోగాలను తీసేయదు, అవకాశాలను పెంచుతుంది

by S Gopi |

ఏఐ యుగం కొత్త నైపుణ్యాలు, కొత్త ఆలోచనా విధానం కోరుకుంటోందని, అందుకే ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులను ఈ మార్పులకు అనుగుణంగా సిద్ధం చేస్తోందని చెప్పారు.

Infosys: ఏఐ ఉద్యోగాలను తీసేయదు, అవకాశాలను పెంచుతుంది
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల ఐటీ సేవల సంస్థల అవసరం తగ్గిపోతుందనే అభిప్రాయాన్ని ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకని కొట్టిపారేశారు. మంగళవారం జరిగిన కంపెనీ 45వ వార్షిక సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన ఆయన, ఏఐ అనేది మునుపెన్నడూ లేనంత పెద్ద సాంకేతిక మార్పు అయినందున ఇలాంటి సందేహాలు రావడం సహజమేనన్నారు. ఏఐ యుగం కొత్త నైపుణ్యాలు, కొత్త ఆలోచనా విధానం కోరుకుంటోందని, అందుకే ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులను ఈ మార్పులకు అనుగుణంగా సిద్ధం చేస్తోందని చెప్పారు. రాబోయే దశాబ్దానికి సైతం రెడీగా ఉందని స్పష్టం చేశారు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో కేవలం కోడింగ్ మాత్రమే కాకుండా కఠినమైన టెస్టింగ్, పటిష్టమైన ఆర్కిటెక్చర్, సైబర్ సెక్యూరిటీ, డేటా గవర్నెన్స్ వంటి ఎన్నో కీలక దశలు ఉంటాయని.. వీటిని ఏఐ ఒంటరిగా భర్తీ చేయలేదన్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ క్లయింట్లలో ఏఐ సాంకేతికతను సమర్థవంతంగా అమలు చేయడంలో ఉన్న లోపాలను పూడ్చడమే తమలాంటి ఐటీ సంస్థల అసలైన పని అని, వేగంగా మారే అలవాటున్న కంపెనీలను ఏఐ మరింత బలోపేతం చేస్తుందే తప్ప తుడిచిపెట్టేయదని నీలేకని వెల్లడించారు.

400 బిలియన్ డాలర్ల నయా బిజినెస్ అవకాశాలపై ఇన్ఫోసిస్ కన్ను

ఈ సరికొత్త ఏఐ విప్లవం వల్ల ప్రపంచవ్యాప్తంగా క్లయింట్లు తమ దశాబ్దాల నాటి పాత సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్‌లోని లోపాలను సరిదిద్దుకుని ఆధునీకరించుకోవడానికి క్యూ కడుతున్నారని, ఇది ఇన్ఫోసిస్‌కు సరికొత్త వ్యాపార అవకాశాలను సృష్టిస్తోందని నీలేకని వివరించారు. టెక్నాలజీ ప్రపంచంలో ఇప్పుడు కొత్త సాఫ్ట్‌వేర్ కొనడం కంటే సొంతంగా నిర్మించుకోవడానికే క్లయింట్లు మొగ్గు చూపుతున్నారన్నారు. గత ఆర్థిక సంవత్సరంలోనే 20,000 మందికి పైగా ఫ్రెషర్లను కంపెనీ నియమించుకుంది. గ్లోబల్ కంపెనీలకు ఏఐ విలువను అందించేందుకు 'ఏఐ-ఫస్ట్ వాల్యూ ఫ్రేమ్‌వర్క్'ను తెచ్చామని, దీని ద్వారా 2030 నాటికి 300 నుంచి 400 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 25 నుండి 33 లక్షల కోట్లు) విలువైన 'ఏఐ-ఫస్ట్' మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇన్ఫోసిస్ పక్కా ప్లాన్‌తో సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు.

Next Story