Adani wilmar: విల్మార్‌తో జాయింట్ వెంచర్ నుంచి బయటకొచ్చిన అదానీ

by S Gopi |

ఈ నిర్ణయం ద్వారా 2 బిలియన్ డాలర్ల(రూ. 17 వేల కోట్ల) విలువైన ఆదాయం సమకూరుతుంది.

Adani wilmar: విల్మార్‌తో జాయింట్ వెంచర్ నుంచి బయటకొచ్చిన అదానీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: సరిగ్గా పాతికేళ్ల క్రితం సింగపూర్‌కు చెందిన విల్మార్ ఇంటర్నేషన్ కంపెనీతో అదానీ గ్రూప్ ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్‌ నుంచి నిష్క్రమిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. జాయింట్ వెంచర్‌లోని పూర్తి వాటాను విక్రయించాలని నిర్ణయించినట్టు సంస్థ స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ద్వారా 2 బిలియన్ డాలర్ల(రూ. 17 వేల కోట్ల) విలువైన ఆదాయం సమకూరుతుంది. ఈ నిధులను అదానీ గ్రూప్ ప్రధాన వ్యాపారమైన ఇంధనం, రవాణా, లాజిస్టిక్స్ వంటి మౌలిక సదుపాయాల్లో ఉపయోగించనున్నట్టు సంస్థ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. ప్రస్తుతం అదానీ విల్మార్‌లో సంస్థకున్న వాటాలో 31.06 శాతన్ని విల్మార్ ఇంటర్నేషనల్‌కు విక్రయించనుంది. మిగిలిన 13 శాతం వాటాను పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనలకు అనుగుణంగా మార్కెట్లో విక్రయానికి ఉంచింది. ఈ వాటాల విక్రయం 2025, మార్చి నాటికి పూర్తి చేయాలని కంపెనీ భావిస్తోంది. జాయింట్ వెంచర్ నుంచి పూర్తిగా బయటకు రావడమే కాకుండా బోర్డులో అదానీ నామినేట్ చేసిన డైరెక్టర్ల పదవి నుంచి కూడా వైదొలగనున్నట్టు వెల్లడించింది.

1999లో సింగపూర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే విల్మార్ ఇంటర్నేషనల్‌తో కలిసి అదానీ గ్రూప్ ఎఫ్ఎంసీజీ రంగంలో 'అదానీ విల్మార్' జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. ఇరు సంస్థలకు 43.97 శాతం మేర వాటాలు ఉన్నాయి. ముఖ్యంగా దేశీయంగా 'ఫార్చ్యూన్ ' బ్రాండ్ పేరుతో వంటనూనె విభాగంలో కంపెనీకి గణనీయమైన వాటా ఉంది. 22 కంటే ఎక్కువ తయారీ ప్లాంట్లు, పంపిణీ నెట్‌వర్క్‌తో, కంపెనీ దేశంలో 16 లక్షలకు పైగా రిటైల్ అవుట్‌లెట్‌లకు నిర్వహిస్తోంది. గతేడాదిలోనే అదానీ విల్మార్‌ను అదానీ కంపెనీ బయటకు వస్తుందనే కథనాలు వెలువడ్డాయి. ప్రధానంగా ఎఫ్ఎంసీజీ నుంచి బయటకొచ్చి ప్రధాన విభాగమైన ఇన్‌ఫ్రా రంగంపై దృష్టి సారించాలని అదానీ గ్రూప్ నిర్ణయించుకుంది.

Next Story