ACs: ఏసీ ధరలు పెరుగుతున్నాయ్

by S Gopi |

ప్రస్తుత పరిస్థితుల మధ్య ధరల పెంపును నివారించలేమని బ్లూస్టార్ మేనేజింగ్ డైరెక్టర్ బి త్యాగరాజన్ అన్నారు.

ACs: ఏసీ ధరలు పెరుగుతున్నాయ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఎండాకాలం మొదలైంది. పెరిగే ఉష్ణోగ్రతల కారణంగా ఏసీలకు పెద్ద ఎత్తున గిరాకీ ఉండనుంది. అయితే, కొత్త ఏసీ కొనాలనుకునే వారికి కంపెనీలు షాక్ ఇవ్వనున్నాయి. ప్రస్తుత త్రైమాసికంలో ఎయిర్ కండిషనర్(ఏసీ) ధరలు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రముఖ ఏసీ తయారీ కంపెనీ బ్లూస్టార్ ఇప్పటికే 10-15 శాతం మేర ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నామని స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల మధ్య ధరల పెంపును నివారించలేమని బ్లూస్టార్ మేనేజింగ్ డైరెక్టర్ బి త్యాగరాజన్ అన్నారు. రాగి లాంటి కీలక ముడి సరుకుల ధరలు భారీగా పెరిగాయని, దీనికి తోడు భారత కరెన్సీ రూపాయి మారకం రేటు వల్ల ఏసీ ఖర్చులను పెంచుతున్నాయి. దీనికి అదనంగా ఇంధన-సామర్థ్య లేబులింగ్ లాంటి కొత్త నిబంధనలు కూడా ఖర్చుల భారం పెంచుతోందని త్యాగరాజన్ తెలిపారు. అయితే, పరిశ్రమ కేవలం 8-10 శాతం తక్కువ లాభాల మార్జిన్‌తో కొనసాగుతోందని, కాబట్టి ముడిసరుకు వ్యయాన్ని భరించే స్థితిలో కంపెనీలు లేవు. ఫలితంగా అదనపు ఖర్చుల భారాన్ని కొంతమేర వినియోగదారులకూ బదిలీ చేయక తప్పదని స్పష్టం చేశారు. కొత్త ఎనర్జీ లేబుల్ నిబంధనల వల్లే ఏసీ స్టార్ రేటింగ్‌ని బట్టి ధరలు 5-10 శాతం పెరుగుతాయని త్యాగరాజన్ అభిప్రాయపడ్డారు. కంపెనీలు సాధారణంగా మెరుగైన డిజైన్, సామర్థ్యం ద్వారా ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నించినప్పటికీ, ఈసారి పెరుగుతున్న ముడి సరుకుల ధరలు, కరెన్సీ ఒత్తిడి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడాన్ని కష్టతరం చేశాయని పేర్కొన్నారు.

Next Story