ఆధార్ - పాన్ ఇంకా లింక్ చేయలేదా? జనవరి 1 నుంచి ఈ ఇబ్బందులు తప్పవు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-12-27 22:00:28  IST  )

సాధారణంగా పాన్ కార్డు అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డుల్లో ఒకటి. అనేక ఆర్థిక అవసరాలకు పాన్ కార్డు తప్పనిసరి కూడా.

ఆధార్ - పాన్ ఇంకా లింక్ చేయలేదా? జనవరి 1 నుంచి ఈ ఇబ్బందులు తప్పవు
X

దిశ, బిజినెస్ బ్యూరో: సాధారణంగా పాన్ కార్డు అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డుల్లో ఒకటి. అనేక ఆర్థిక అవసరాలకు పాన్ కార్డు తప్పనిసరి కూడా. బ్యాంకు ఖాతా మొదలుకొని ఎక్కువ మొత్తం నగదు బదిలీ చేసేందుకు, ఆదాయ పన్ను దాఖ చేసేందుకు, లోన్ కోసమైనా అన్ని దశల్లో చాలా ముఖ్యమైంది. అయితే, దేశంలో నకిలీ పాన్ కార్డులను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడాన్ని తప్పనిసరి చేసింది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఆధార్‌తో పాన్ కార్డును ఖచ్చితంగా లింక్ చేయాలి. ఈ నేపథ్యంలో గతంలో పాన్ కార్డు తీసుకున్న వారు ఆధార్‌తో అనుసంధానం చేయడానికి ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు గడువు విధించారు. ఆ తేదీలోపు లింక్ ప్రక్రియను పూర్తి చేయకపోతే 2026 జనవరి 1 నుంచి పాన్ కార్డు పనిచేయబోదని, ఫలితంగా ఆర్థిక పరమైన పన్నుల్లో సమస్యలు ఉత్పన్నమవుతాయని సీబీడీటీ స్పష్టం చేసింది. 2024, అక్టోబర్ 1కు ముందు ఆధార్ ఐడీ ద్వారా పాన్ కార్డు తీసుకున్న వారు పాన్-ఆధార్ అనుసంధానం ప్రక్రియను డిసెంబర్ 31 కంటే ముందుగా పూర్తిచేయాలి. మిగిలిన వారికి 2023లోనే గడువు ముగిసింది. అవి పనిచేయడం లేదు. వాటి కోసం రూ.1,000 జరిమానాతో ఆధార్‌తో లింక్ చేసుకోవచ్చు.

లింక్ చేయకపోతే ఏం జరుగుతుంది?

డిసెంబర్ 31 గడువులోపు పాన్-ఆధార్ అనుసంధానం చేయడంలో విఫలమైతే.. జనవరి 1 నుంచి పాన్ పనిచేయదు. ఫలితంగా పన్ను రిటర్నుల కోసం దాఖలు చేయడం కుదరదు, వాపస్, ఇతర ఆర్థిక కార్యకలాపాలలో ఇబ్బందులు ఏర్పడతాయి.

* బ్యాంక్ లావాదేవీలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి పెట్టుబడులపై అధిక టీడీఎస్ వర్తిస్తుంది.

* బ్యాంకులు, పోస్టాఫీసుల్లో రూ.50వేలు.. అంతకంటే ఎక్కువ విలువైన నగదు బదిలీ చేయడం వీలవదు.

* డీమ్యాట్‌ అకౌంట్ ఓపెన్ చేసేందుకు కేవైసీ ప్రక్రియను పూర్తిచేయడం కుదరదు.

* బ్యాంకులు లోన్లు ఇవ్వడానికి కూడా నిరాకరిస్తాయి.

* ప్రస్తుత ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం, ఇన్-యాక్టివ్ పాన్ ద్వారా ఆర్‌బీఐ బాండ్లలో పెట్టుబడి పెట్టడానికి అనుమతి ఉండదు.

అనుసంధానం ఎలా?

* ఆదాయపు పన్ను శాఖ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి సులభమైన ఆన్‌లైన్ పద్ధతిని అందిస్తోంది. ఆదాయపు పన్ను అధికారిక పోర్టల్‌లో పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

* హోమ్ పేజీలో ‘క్విక్ లింక్స్’ కింద ‘లింక్ ఆధార్’పై క్లిక్ చేయాలి.

* పాన్, ఆధార్ నంబర్లను ఆధార్‌లో ఉన్న విధంగానే పేరును ఎంటర్ చేయాలి. తర్వాత ‘వ్యాలిడేట్’పై క్లిక్ చేయాలి.

* ఆధార్-రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ నంబర్‌ను ఎంటర్ చేయాలి.

* గతంలో ముగిసిన గడువు తేదీల తర్వాత లింక్ ప్రక్రియ చేస్తుంటే, ఈ-పే ట్యాక్స్ ద్వారా రూ. 1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

* అనంతరం కన్ఫర్మేషన్ మెసేజ్ కనిపిస్తుంది. పోర్టల్‌లో స్టేటస్ అప్‌డేట్‌ అవడానికి సాధారణంగా 3–5 పని దినాలు పడుతుంది.

* ఆ తర్వాత, విజయవంతంగా పాన్, ఆధార్ అనుసంధానం జరిగిందని నిర్ధారణ కోసం పోర్టల్‌లో పాన్-ఆధార్ లింక్ స్టేటస్‌ను తనిఖీ చేసుకోవచ్చు.

స్టేటస్ అప్‌డేట్ కోసం

ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత.. స్టేటస్ చెక్‌ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. దీనికోసం ఆదాయపు పన్ను అధికారిక వెబ్‌సైట్‌లో ‘లింక్‌ ఆధార్‌ స్టేటస్‌’పై క్లిక్‌ చేయాలి. అనంతరం పాన్‌, ఆధార్‌ వివరాలను ఎంటర్‌ చేసి ‘లింక్ ఆధార్ స్టేటస్’ను క్లిక్‌ చేయాలి. అనుసంధానం పూర్తయి ఉంటే, లింక్‌ అయినట్లు మెసేజ్ కనిపిస్తుంది. లేకుంటే మీ రిక్వెస్ట్ వ్యాలిడేషన్ కోసం పంపినట్లు చూపిస్తుంది.

Next Story