స్టాక్ మార్కెట్‌ను ముంచెత్తిన నష్టాల సునామీ.. రికార్డు కనిష్టానికి రూపాయి!

by Ramesh Naini |

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ పతనాన్ని చవి చూశాయి. అంతర్జాతీయ ప్రతికూల పవనాలు, భౌగోళిక ఉద్రిక్తతలు ఇన్వెస్టర్ల సంపదను ఆవిరి చేశాయి.

స్టాక్ మార్కెట్‌ను ముంచెత్తిన నష్టాల సునామీ.. రికార్డు కనిష్టానికి రూపాయి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ పతనాన్ని చవి చూశాయి. అంతర్జాతీయ ప్రతికూల పవనాలు, భౌగోళిక ఉద్రిక్తతలు ఇన్వెస్టర్ల సంపదను ఆవిరి చేశాయి. వరుసగా నాలుగో రోజూ నష్టాల్లోనే ముగిసిన సూచీలు, మదుపరులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు, అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు మార్కెట్‌ను కుదిపేశాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 105 డాలర్లకు చేరువయ్యాయి. చమురు ధరల పెరుగుదల ద్రవ్యోల్బణ భయాలను పెంచగా, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) నిరంతరంగా పెట్టుబడులను ఉపసంహరించుకోవడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. మరోవైపు, ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు పొదుపు పాటించాలని ప్రధాని మోడీ పిలుపునివ్వడం కూడా మార్కెట్‌పై ప్రభావం చూపిందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ముగింపు గణాంకాలు.. రూపాయి విలువ

సెన్సెక్స్.. రోజంతా తీవ్ర ఒడిదుడుకుల మధ్య ట్రేడై, చివరకు 1,456 పాయింట్లు నష్టపోయి 74,559 వద్ద ముగిసింది. నిఫ్టీ..436 పాయింట్లు కోల్పోయి 23,379 వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 95.63 వద్దకు పడిపోయి జీవితకాల కనిష్టాన్ని నమోదు చేసింది.

రంగాల వారీగా ప్రభావం..

ఐటీ రంగం అత్యంత దారుణంగా దెబ్బతిన్నది. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి అగ్రశ్రేణి ఐటీ షేర్లు 4 శాతం వరకు నష్టపోయాయి. బ్యాంకింగ్, ఆటో, రియల్టీ రంగాలు కూడా భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.

లాభపడిన షేర్లు ఇవే..

మార్కెట్ మొత్తం కుప్పకూలినా, ముడిచమురు ధరల పెరుగుదల, ప్రభుత్వ రాయల్టీ కోత నిర్ణయంతో చమురు కంపెనీలైన ఓఎన్జీసీ (ONGC), ఆయిల్ ఇండియా షేర్లు 6 శాతం వరకు లాభపడి ఇన్వెస్టర్లకు కొంత ఊరటనిచ్చాయి. ముడిచమురు ధరల కదలికలు, పశ్చిమాసియా పరిణామాలే రానున్న రోజుల్లో మార్కెట్ దిశను నిర్దేశిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Next Story