Indian Car Brands: దక్షిణాఫ్రికాలో అమ్ముడైన 50 శాతం కార్లకు భారత మూలాలు

by S Gopi |

మహీంద్రా దక్షిణాఫ్రికాలో ప్రధాన సంస్థగా అవతరించింది

Indian Car Brands: దక్షిణాఫ్రికాలో అమ్ముడైన 50 శాతం కార్లకు భారత మూలాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ వాహనాలకు అంతర్జాతీయంగా గిరాకీ పెరుగుతోంది. ఈ ఏడాది దక్షిణాఫ్రికాలో అమ్ముడైన మొత్తం కార్లలో దాదాపు సగం భారత మూలాలు ఉన్నాయని ఓ నివేదిక తెలిపింది. అందులోనూ అమ్ముడైన కార్లలో ఎక్కువగా మహీంద్రా, టాటా బ్రాండ్లే ఎక్కువగా ఉండటం గమనార్హం. ప్రముఖ మార్కెట్ పరిశోధనా సంస్థ లైట్‌స్టోన్ నివేదిక ప్రకారం, దక్షిణాఫ్రికాలో విక్రయించిన కార్లలో సగం భారత కంపెనీలు తయారు చేసినవి లేదా భారత్‌లోనే తయారైన విడిభాగాలను ఉపయోగించిన గ్లోబల్ బ్రాండ్ల కార్లు అని పేర్కొంది. అంతేకాకుండా మహీంద్రా దక్షిణాఫ్రికాలో ప్రధాన సంస్థగా అవతరించింది, ముఖ్యంగా కంపెనీకి చెందిన పికప్ (పిక్‌అప్ ట్రక్) మోడళ్లు గతేడాది పెద్ద ఎత్తున అమ్ముడయ్యాయి. దీంతో మహీంద్రా దక్షిణాఫ్రికా కార్ల మార్కెట్‌లో భారత ఉనికిని పెంచడానికి సహాయపడింది. ఇక, అంతకుముందు 2024లో దక్షిణాఫ్రికాలో అమ్ముడైన జపనీస్ బ్రాండ్ కార్లలో 84 శాతం భారత్ నుంచి దిగుమతి అయ్యాయని, కేవలం 10% మాత్రమే జపాన్‌లో తయారయ్యాయని కూడా లైట్‌స్టోన్ పేర్కొంది. జపనీస్, కొరియన్ బ్రాండ్‌ల క్రింద అమ్ముడయ్యే అనేక కార్లు వాస్తవానికి భారత్‌లోనే తయారై, ఆ తర్వాత దక్షిణాఫ్రికాకు రవాణా అయ్యాయి. 2024లో మొత్తం వాహన అమ్మకాలలో చైనీస్ కార్లు కేవలం 11 శాతం మాత్రమే ఉన్నాయి. ఇదే సమయంలో దక్షిణాఫ్రికాలో అమ్ముడైన అన్ని వాహనాలలో 36 శాతం భారత్ నుంచి దిగుమతి అయ్యాయి, ఇది దక్షిణాఫ్రికాలో స్థానికంగా తయారైన కార్ల 37 శాతం వాటాకు దాదాపు సమానం.

పికప్ ట్రక్కులు మరియు తేలికపాటి వాణిజ్య వాహనాలను ఈ డేటా నుంచి వేరుచేస్తే, మార్కెట్‌లో భారత వాటా మరింత పెరుగుతుంది. లైట్‌స్టోన్ ప్రకారం, 2025 మొదటి ఐదు నెలల్లో దక్షిణాఫ్రికాలో అమ్ముడైన మొత్తం ప్యాసింజర్ కార్లలో 49 శాతం భారత్ నుంచి దిగుమతి అయ్యాయి. ఈ వాహనాలలో చాలావరకు భారత్‌కు చెందిన మారుతీ సుజుకి ప్లాంట్ల నుంచి వెళ్లాయి. స్టార్లెట్, స్టార్లెట్ క్రాస్, విట్జ్, అర్బన్ క్రూజర్ వంటి పాపులర్ టయోటా మోడళ్లను కూడా మారుతీ సుజుకి సరఫరా చేసింది. ప్రధానంగా తక్కువ కార్మిక, ఉత్పత్తి వ్యయాల కారణంగా మనదేశంలో కార్ల తయారీ చౌకగా ఉండటమే ఈ స్థాయి వృద్ధికి కారణమని నిపుణులు పేర్కొన్నారు.

Next Story