AC Prices: పెరగనున్న ఏసీ ధరలు

by S Gopi |

విడిభాగాల కొరత ఏర్పడుతోందని, ఫలితంగా ధరలు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.

AC Prices: పెరగనున్న ఏసీ ధరలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఏప్రిల్‌లో ఎయిర్‌ కండీషనర్ల (ఏసీ)కు గిరాకీ పెరుగుతుందని కంపెనీలు భావిస్తున్నాయి. అయితే, దక్షిణాదిన అడపాదడపా వర్షపాతం, ఉత్తర, తూర్పు ప్రాంతాల్లోని కొన్నిచోట్ల మోస్తరు వార్షం కారణంగా అమ్మకాలపై ప్రభావం చూపినప్పటికీ, తాజా వాతావరణ సూచనల్లో తీవ్రమైన ఎండలు ఉంటాయనే సంకేతాలు రెండంకెల స్థాయిలో డిమాండ్‌ను పెంచుతాయని ఆశిస్తున్నాయి. ఈ క్రమంలో అందుకు తగినట్టు విడిభాగాల కొరత ఏర్పడుతోందని, ఫలితంగా ధరలు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. బ్లూస్టార్, శాంసంగ్, హైయర్ సహా ఏసీ తయారీ కంపెనీ ఈ నెలలో 5 శాతం మేర ధరలు పెంచనున్నట్టు సంకేతాలిచ్చాయి. ముడిసరుకుల వ్యయానికి తోడు కరెన్సీ మార్పిడిలో హెచ్చుతగ్గులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికీ రూమ్ ఏసీ విభాగం ప్రధానంగా చైనా నుంచి వచ్చే కంప్రెసర్లు, పీసీబీలు, ఫ్యాన్ మోటార్లు వంటి కీలక భాగాల దిగుమతులపైనే ఆధారపడి ఉంది. ట్రంప్ టారిఫ్ పరిణామాలపై పరిశ్రమ అప్రమత్తంగా ఉంది. హైయర్ ఇండియా ఏప్రిల్ 15 నుంచి రూమ్ ఏసీల ధరలను 4-5 శాతం పెంచుతున్నామని హెయిర్ ఇండియా ప్రెసిడెంట్ ఎన్ సతీష్ అన్నారు. ముడిసరుకు ఖర్చు, మారకపు రేటు ఆధారంగా ఇప్పటికే ఏసీ ధరలను 5 శాతం పెంచామని బ్లూస్టార్ ఎండీ బి త్యాగరాజన్ పేర్కొన్నారు. రాగి, ఉక్కు, అల్యూమినియం సహా పలు ముడి పదార్థాల ధరలు పెరుగుతున్నాయి. అదే సమయంలో డాలర్ వర్సెస్ రూపాయి మారకం విలువ అస్థిరంగా ఉందని ఆయన అన్నారు. శాంసంగ్ సైతం 3 శాతం పెంచాలని నిర్ణయించినట్టు కంపెనీ ఇండియా డిజిటల్ అప్లయెన్సెస్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ జూఫ్రాన్ ఆలం వెల్లడించారు.

Next Story